ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుకు సంబంధించి సోమవారం ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అమరావతిని ధ్వంసం చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, ఇది కేవలం రైతులకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, రాష్ట్ర ప్రజలందరికీ చెందినదన్నారు.

Also Read:బాబుకు షాక్: టీడీఎల్పీ భేటీకి గంటా, వాసుపల్లి గణేష్‌డుమ్మా, ఏం జరుగుతోంది?

అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలంటూ 32 రోజులుగా రైతులు, మహిళలు, యువత రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారని.. ఆడపడుచులపై పోలీసులు దాడులకు పాల్పడుండటం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్‌ను సంతోష పెట్టేందుకు పోలీసులు బలి పశువులు అవుతున్నారని.. అధికారం చేతిలో ఉంటే టీడీపీ కన్నా బాగా పనిచేయాలని సూచించారు. టీడీపీ హయాంలో ఎవరైనా, ఎక్కడైనా స్వేచ్ఛగా సమావేశాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించామని చంద్రబాబు గుర్తుచేశారు.

Also Read:కీలక నేతలతో జగన్ భేటీ: ఏం జరుగుతోంది?

విశాఖపట్నం, అక్కడి ప్రజలు అంటే తనకు ఇంతో ఇష్టమని... ఇవాళ రైతులను మోసం చేసిన వ్యక్తులు, రేపు విశాఖ ప్రజలకు నమ్మకద్రోహం చేయరని గ్యారెంటీ ఏంటని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. విశాఖపై వైసీపీ నేతలకు ఎలాంటి అభిమానం లేదని.. కేవలం అక్కడి భూములపైనే వారి కన్నుందని చంద్రబాబు ఆరోపించారు.

అమరావతిని కాపాడే బాధ్యత యువతపై ఉందని, రాజధానిని ఇక్కడి నుంచి తరలిస్తే వైసీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని బాబు హెచ్చరించారు. అమరావతిపై మద్రాస్ ఐఐటీ నివేదిక ఇచ్చిందని అన్నారని.. వాళ్లు నివేదికే ఇవ్వలేదని రుజువైందని చంద్రబాబు తెలిపారు.