అమరావతిలో భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు చంద్రబాబునాయుడికి మంగళవారం  హైద్రాబాద్ లో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై ఎలా వ్యవహరించాలన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చించిన చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.  తనపై నమోదైన ఎఫ్‍ఐ‍ఆర్‍ను కొట్టేయాలంటూ చంద్రబాబు రేపు(గురువారం) ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.  

గుంటూరు జిల్లా వంగంళగిరి శానససభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కె) అమరావతి భూముల విషయంలో అవకతవకలు జరిగాయంటూ గత నెల 24వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆ మర్నాడే ఈ పిర్యాదుపై విచారణకు ఆదేశించారు. సిఐడి డీఎస్పీ సూర్యభాస్కర్ రావు నేతృత్వంలోని బృందం విచారణ జరిపింది. సూర్యభాస్కర్ రావు బృదం ఈ నెల 12వ తేదీన నివేదికను సమర్పించింది.

ఆ నివేదిక ఆధారంగా సీఐడి కేసులు నమోదు చేసింది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి చిక్కులు వచ్చి పడ్డాయి. చంద్రబాబుపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడి ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా ఉండడం గమనార్హం. దానికి ప్రాతిపదిక ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదే.

 read more   చట్ట సవరణతోనే అక్రమాలు: అసైన్డ్ భూములపై సీఐడీ అనుమానం

ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణలో చంద్రబాబు వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు. మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాకుండా ఉండడానికి గల అవకాశాలపై చంద్రబాబు న్యాయనిపుణులతో ఆలోచిస్తున్నారు.  సిఐడి ఇచ్చిన నోటీసులను హైకోర్టులో సవాల్ చేసే విషయంపై చంద్రబాబు న్యాయవాదులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 

రాజధాని ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలను బెదిరించి భూములను ఆక్రమించుకున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదు చేశారు. భూములు ఇవ్వకపోతే పరిహారం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బెదిరించి ఐసైన్డ్ భూములను లాక్కున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు మెడకు ఐసైన్డ్ భూముల వ్యవహారం చుట్టుకుంది. 

సీఐడి నోటీసుల నేపథ్యంలో చంద్రబాబునాయుడు బుధవారం అంటే ఇవాళ అమరావతికి వెళ్లనున్నారు.  సీఐడీ నోటీసులపై న్యాయ నిపుణుల సలహాతోనే ముందుకు వెళ్లాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని సమాచారం.