ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్‌ను టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత  చంద్రబాబు నాయుడు కలిశారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 14 పేజీల లేఖను చంద్రబాబు గవర్నర్‌కు సమర్పించారు.

పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. గత ఏడాది కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై 800 దాడులు జరిగాయని, రాజ్యాంగబద్ధ సంస్ధలు నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం దాడులకు దిగుతోందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

అంతకుముందు గురువారం నాడు చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనమండలిలో నిన్న చోటు చేసుకొన్న పరిణామాలపై ఆయన చర్చించారు.

శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు చేసిన పోరాటాన్ని చంద్రబాబునాయుడు అభినందించారు. అనారోగ్యం, వృద్ధాప్యం  లెక్క చేయకుండా ఎమ్మెల్సీలు హాజరయ్యారని ఆయన కితాబిచ్చారు. శాసనమండలిలో ఎమ్మెల్సీలు పార్టీ గర్వపడేలా పోరాటం చేశారని ఆయన అభినందించారు.

Also Read:ప్యాంట్ జిప్ తీసి చూపించానా... : మంత్రి అనిల్ కౌంటర్

వైసీపీ ప్రలోభాలకు లొంగిపోయి కొందరు ఎమ్మెల్సీలు చరిత్ర హీనులుగా మారారన్నారు. మంత్రుల దాడులను తట్టుకొని ఎమ్మెల్సీలు పోరాటం చేయడం అభినందనీయమన్నారు. 

Also Read:లోకేష్ ప్రోత్సాహంతోనే మాపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి యత్నం: మంత్రి వెల్లంపల్లి

పార్టీ నిర్ణయానికి అనుగుణంగా పోరాటం చేసిన ఎమ్మెల్సీలు చరిత్రలో నిలిచిపోయారని ఆయన చెప్పారు. పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు మంత్రులతో పోరాటం చేశారని ఆయన కితాబు ఇచ్చారు. 

ఏపీ శాసనమండలిలో ఈ నెల 17వ తేదీన సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సమయంలో మంత్రులు, టీడీీపీ ఎమ్మెల్సీలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పక్షాలు ఒకానొక  దశలో ఇరు వర్గాల మధ్య తోపుటాట కూడ చోటు చేసుకొంది.