ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, దళితులపై  దాడులు, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడం, చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం రామచంద్రపై దాడి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంపై అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా కలవరం చెందుతున్నారని టీడీపీ చీఫ్ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై వైకాపా ప్రభుత్వం అనాగరికంగా దాడులు, దౌర్జన్యాలు చేస్తోందని బాబు ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల వారిపైనే ప్రత్యేకంగా దాడులకు పాల్పడటం హేయమైన చర్యగా ప్రతిపక్షనేత అభివర్ణించారు. 

దళితులపై దాడుల్లో భాగమే తాజాగా జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలో పట్టపగలే రామచంద్రపై దాడి చేయడం దారుణమన్నారు.

విజయవాడలో సెప్టెంబర్ 26న దళిత మహాసభ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో జడ్జి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వ దుశ్చర్యలను  ఖండించిన మరుసటిరోజే ఈ దాడి జరగడం గమనార్హమని బాబు వ్యాఖ్యానించారు.

దీనిని బట్టే అధికార పార్టీ ప్రోద్భలంతో జడ్జి రామకృష్ణ గొంతు నొక్కడంలో భాగంగానే కుట్ర పూరితంగా ఈ దాడి జరిగినట్లు రుజువు అవుతోందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చేస్తున్న ఈ దుర్మార్గ చర్యలన్నీ  మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకే విఘాతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న వరుస దాడులు చూస్తుంటే గుండె కలుక్కుమంటోందందన్నారు. వీటన్నింటిపై తీవ్ర ఆవేదనతో పదేపదే మీ దృష్టికి లేఖల ద్వారా తీసుకురావడం జరుగుతోందని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

మొగ్గలోనే వీటిని అణిచివేసే చర్యలు చేపట్టకపోవడమే దళితులపై రోజురోజుకూ ఈవిధమైన దాడులు పేట్రేగడానికి ప్రధాన కారణంగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఈ దురాగతాలపై తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఈ దాడులు, దౌర్జన్యాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డీజీపీని కోరారు.