టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన శనివారం లేఖ రాశారు.

బిక్కవోలు మండలం ఇల్లపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైసీపీ మద్దతుదారు.. టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా వారిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు.

పిల్లలు భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దన్నందుకు వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తపై, అతని కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.

అక్రమ కేసులు పెట్టి టీడీపీ సానుభూతిపరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దాడి చేసిన వారిపై కాకుండా గాయపడిన వారిపై కేసులు పెడుతారా?అని ప్రతిపక్షనేత ప్రశ్నించారు.

కేసులు పెడితే ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చూడాలని డీజీపీని చంద్రబాబు కోరారు