తాతా మనవళ్లు : 53 రోజుల తర్వాత దేవాన్ష్‌ను చూడగానే .. చంద్రబాబు ఉద్వేగం , మనవడిని హత్తుకుని
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు . తాతయ్య చంద్రబాబును అన్ని రోజుల తర్వాత చూడటంతో దేవాన్ష్.. ఆయనను కౌగిలించుకున్నారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 53 రోజుల తర్వాత బయటకొచ్చిన తమ అధినేతను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా రాజమండ్రికి తరలివచ్చారు. ఇక చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆనందం అంతా ఇంతా కాదు. ఈ రెండు నెలల కాలంలో కుటుంబం తలో దిక్కు అయ్యింది. చంద్రబాబు జైల్లో వుండగా.. లోకేష్ ఢిల్లీలో, భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రతో, నారా బ్రాహ్మాణి హైదరాబాద్, రాజమండ్రిలో వుంటూ అన్ని పనులను పర్యవేక్షించారు.
అయితే చంద్రబాబు జైలు నుంచి విడుదలైన వెంటనే మనవడు దేవాన్ష్‌ను చూసి మురిసిపోయారు. మనవడిని అప్యాయంగా హత్తుకున్నారు. గడిచిన 53 రోజులుగా రాజమండ్రిలోనే వుంటున్నా.. పలుమార్లు లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరిలు చంద్రబాబుతో ములాఖత్ అవుతున్నా.. దేవాన్ష్‌ను మాత్రం తీసుకెళ్లలేదు. అంతేకాదు.. తాతయ్య ఎక్కడ అని ఆ బాబు అడిగితే ఫారిన్ వెళ్లాడని చెప్పామని స్వమంగా భువనేశ్వరి పేర్కొన్నారు. జైలు వాతావరణాన్ని చూస్తే పిల్లలు మనసులు కలుషితం అవుతాయని భావించిన నారా కుటుంబ సభ్యులు దేవాన్ష్‌ను చంద్రబాబు దగ్గరకి తీసుకెళ్లలేదు.
ఈ నేపథ్యంలో తాతయ్య చంద్రబాబును అన్ని రోజుల తర్వాత చూడటంతో దేవాన్ష్.. ఆయనను కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో ఎంత బిజీగా వున్నప్పటికీ.. వారంతానికి హైదరాబాద్ చేరుకునేవారు చంద్రబాబు.. అక్కడ మనవడితో ఆడుకుంటూ గడిపేవారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు.
అంతకుముందు చంద్రబాబు చర్య, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. అలాగే ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు అభిమానులు, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.