రాజధాని వ్యవహారాన్ని జగన్ మూడు ముక్కలాట అనుకుంటున్నారంటూ ఫైరయ్యారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రికి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో తెలియదన్నారు.

అమరావతిలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని.. ఇప్పటి వరకు రాజధానిని మార్చిన చరిత్ర లేదని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ రాజధానంటే మూడు రాజధానులు చెప్పే పరిస్ధితి వస్తుందని ఆయన మండిపడ్డారు.

Also Read:జగన్ చేతిలో అమరావతి భవితవ్యం: సర్కార్‌కు బోస్టన్ నివేదిక

విశాఖను డేటా హాబ్‌గా తయారు చేయడానికి తాము చేసిన ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని బాబు గుర్తుచేశారు. విశాఖలో నాలుగు సార్లు జరిపిన సీఐఏ సదస్సును రేకుల షెడ్లలో జరిపామని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి కోసం భూములిచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం దారుణమైన చర్యని.. మహిళలను బలవంతంగా వాహనాల్లో తరలించడం అమానుషమని చంద్రబాబు మండిపడ్డారు. 

అందరికి సమానదూరంలో ఉంటుందనే అభిప్రాయంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని చంద్రబాబు తెలిపారు. తాను ఇచ్చిన ఒక్క పిలుపుతో రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అమరావతిలో ఇప్పటి వరకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

Also Read:వైఎస్ జగన్ ఆఫీసులో రగడ: నీలం సహానీపై ప్రవీణ్ ప్రకాశ్ పెత్తనం?

రాజధానిలో వైసీపీ నేతలు మాట్లాడితే కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ఇల్లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదా..? అని ఆయన నిలదీశారు.

జగన్ ప్రభుత్వం కారణంగా విజయవాడ, విశాఖపట్నానికి కేటాయించిన విమాన సర్వీసులు రద్దయి పోయాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 20 వేల ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశ్యంతో శివనాడార్‌ను స్వయంగా తాను కలుసుకుని, ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. 

కియో మోటార్స్ కోసం గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఆరు నెలల్లో పూర్తి చేసి కంపెనీకి కబురుపెట్టానన్నారు. జగన్ పాలనలో కంపెనీలు పారిపోతున్నాయని బాబు గుర్తుచేశారు. రైతులపై జగన్ ప్రభుత్వం హత్యాయత్నం కేసులు పెట్టారని.. వాళ్ల దగ్గర తుపాకులు, కత్తులు ఉన్నాయా అని ఆయన మండిపడ్డారు.

Also Read:జగన్‌కు సీబీఐ కోర్టు షాక్: కీలక ఆదేశాలు

అమరావతిని నిలబెట్టుకునే వరకు వెనక్కి తగ్గవద్దని చంద్రబాబు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ జగన్ లాంటి వారిని చూడలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు ఆంధ్రప్రదశ్‌కు వున్నాయని వాటిని సక్రమంగా ఉపయోగించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. నాడు ఏ కులం వుందని హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానో చెప్పాలని బాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రాంతాలను స్మార్ట్ సిటీలుగా అభవృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించామని ఆయన గుర్తుచేశారు.