అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీకి, సిఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు మధ్య అగ్గి రాజుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అందుకు కారణాలేమిటనేది మాత్రం తెలియడం లేదు. 

నీలం సహానీపై ప్రవీణ్ ప్రకాశ్ పెత్తనం చేస్తున్నారని అంటున్నారు. తన మాట విని తీరాల్సిందేనని ప్రవీణ్ ప్రకాశ్ నీలం సహానీతో అన్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరిక మేరకు తాను కేంద్ర సర్వీసుల నుంచి ప్రభుత్వ కార్యదర్శిగా వచ్చానని, ప్రవీణ్ ప్రకాశ్ సిఫార్సుతో కాదని సహానీ అంటున్నట్లు తెలుస్తోంది. 

తనకున్న అనుభవంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడానికి ఇష్టపడ్డానని, మరో నెలల్లో రిటైర్ అవుతున్నానని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ కావాలనేది తన కోరిక అని, అందుకే ఇక్కడికి వచ్చానని నీలం సహానీ అంటున్నట్లు చెబుతున్నారు. 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీద జారీ కావాల్సిన ఉత్తర్వులు ప్రవీణ్ ప్రకాష్ పేరు మీద జారీ అవుతున్నాయనే ఉద్దేశంతో నీలం సహానీ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకన్నా జూనియర్ అయిన అధికారి తనపై పెత్తనం చేయడమేమిటని ఆమె అనడమే కాకుండా ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.