జగన్ పోవాలి... సీమలో సిరులు పండాలని, చరిత్రలో ఎప్పుడూ ఏ సీఎం కూడా రాయలసీమకు ఇంత ద్రోహం చేయలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సిగ్గుతో తలవంచుకుని రాయలసీమకు సీఎం క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

నదుల అనుసంధానం ద్వారా ఏపీలో ప్రతి ఎకరాకు నీరందించే ప్రయత్నం చేశామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరిగేషన్ కోసం టీడీపీ హయాంలో 68 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కేవలం 22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 12,441 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత రూ.2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం సిగ్గు లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇరిగేషన్ కోసం టీడీపీ హయాంలో బడ్జెట్టులో 9.63 శాతం కేటాయిస్తే .. వైసీపీ ప్రభుత్వం 2.35 శాతం మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. రాయలసీమ ద్రోహులు మీరు కాదా అని చంద్రబాబు నిలదీశారు. 

రాయలసీమకు నీళ్లిస్తే రతనాల సీమ అవుతుందని.. రాయలసీమకు గుండె లాంటి ముచ్చుమర్రి ప్రాజెక్టును వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారని దుయ్యబట్టారు. పూర్తికాదని తెలిసినా రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు 38 వేల కోట్ల టెండర్ ఎందుకు పిలిచారని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. జగన్ పోవాలి... సీమలో సిరులు పండాలని, చరిత్రలో ఎప్పుడూ ఏ సీఎం కూడా రాయలసీమకు ఇంత ద్రోహం చేయలేదన్నారు.

ALso Read: జగన్ పాలన.. ఏపీలో భూముల విలువపై మరోసారి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

బూతులు తిట్టడం కాదు ...ధైర్యం ఉంటే ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తుంది ... రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. సిగ్గుతో తలవంచుకుని రాయలసీమకు సీఎం క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.