జగన్ పాలన.. ఏపీలో భూముల విలువపై మరోసారి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో భూముల విలువపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనవచ్చని వ్యాఖ్యానించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో భూముల విలువ పడిపోయిందన్నారు. తెలంగాణలో ఒక్క ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనవచ్చని వ్యాఖ్యానించారు. చేతగాని ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని.. జగన్ పాలనలో ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేరన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. అయినప్పటికీ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై అధికారులతో ఇప్పటి వరకు సమీక్షా సమావేశం నిర్వహించలేదని.. జగన్ విధానాలతో రైతులు అప్పుల పాలయ్యారని టీడీపీ చీఫ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలోని 93 శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల సగటు రుణం రూ.2,45,554గా వుందని.. ఇదే సమయంలో దేశంలోని రైతుల సగటు అప్పు రూ.74 వేలు వుందని చంద్రబాబు తెలిపారు. ఓ ఎకరా అమ్మేసి అప్పులు కట్టేద్దామని అనుకున్నా.. భూములకు విలువ లేదని ఎద్దేవా చేశారు.
ALso Read: జగన్ పులివెందుల పులి కాదు తాడేపల్లి పిల్లి..: దేవినేని ఉమ సెటైర్లు (వీడియో)
అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు వస్తేనే సాగు భూముల ధరలు పెరుగుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంకి ఒక్కటే లక్ష్యం దోచుకో..దాచుకో... కోట్లు.. లాక్కో.. కేసులుపెట్టు అంటూ దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో వ్యవసాయ రంగం 11 శాతం అభివృద్ధి సాధించిందని ప్రతిపక్షనేత గుర్తుచేశారు. అలాగే 62 ప్రాజెక్‌లు ప్రారంభించి 24 పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.