ఏపీ, తెలంగాణల్లో భూముల ధరలను పోల్చుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాయాక ఏపీలో భూముల రేట్లు పడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. గురువారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మితే తెలంగాణ మూడు ఎకరాలు కొనేవాళ్లని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చంద్రబాబు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కట్టిన తర్వాత రూ.30వేలుగా వున్న ఎకరం, రూ.30 కోట్లకు చేరిందన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాయాక ఏపీలో భూముల రేట్లు పడిపోయాయని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూములు కొనేవాళ్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పటాన్ చెరులో ఎకరం 30 కోట్లు వుందని.. దానిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని కేసీఆర్ అన్నారని చంద్రబాబు తెలిపారు.
ALso Read: తెలంగాణలో భూమి బంగారం .. చంద్రబాబే ఒప్పుకున్నారు : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కియా మోటార్స్‌తో అనంతపురంలో, రాజధాని రావడంతో అమరావతిలో భూముల విలువ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. వాజ్‌పేయిని ఒప్పించి నెల్లూరు నుంచి చెన్నై వరకు రోడ్డు వేశామని, తెలుగుదేశం పార్టీ విధానాలు జగన్ అనుసరించి వుంటే ఏపీ నుంచి అమర్‌రాజా వెళ్లిపోయేది కాదని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడిస్తేనే రాష్ట్రం గెలుస్తుందని.. ఈ నాలుగేళ్లు సీఎం నరకం చూపించారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కళ్లు మూయకుండా అబద్ధాలు చెబుతారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.
కాగా.. ఇటీవల పటాన్ చెరులో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం భూమి బంగారం అయ్యిందన్నారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనుక్కోవచ్చని అనుకునేవారని కేసీఆర్ అన్నారు. మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపిస్తే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ సీఎం . పటాన్ చెరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన వుందన్నారు. పటాన్ చెరులో కాలుష్య నియంత్రణకు రాజీవ్ శర్మ ఎన్నో సిఫారసులు చేశారని కేసీఆర్ తెలిపారు.
