తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారని గుర్తుచేశారు కేసీఆర్. తెలంగాణలో ప్రస్తుతం భూమి బంగారం అయ్యిందన్నారు 

తెలంగాణలో ప్రస్తుతం భూమి బంగారం అయ్యిందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సంగారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చని స్వయంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అన్నారని గుర్తుచేశారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు కొనుక్కోవచ్చని అనుకునేవారని కేసీఆర్ అన్నారు. మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపిస్తే పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ సీఎం . పటాన్ చెరును రెవెన్యూ డివిజన్‌గా చేయాలనే ప్రతిపాదన వుందన్నారు. పటాన్ చెరులో కాలుష్య నియంత్రణకు రాజీవ్ శర్మ ఎన్నో సిఫారసులు చేశారని కేసీఆర్ తెలిపారు. 

పటాన్ చెరులో పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని.. రెవెన్యూ డివిజన్ ప్రతిపాదన కూడా వుందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాస్ట్రం తెలంగాణ అని.. తలసరి ఆదాయంలోనూ నెంబర్ వన్‌గా నిలిచిందని సీఎం తెలిపారు. హరీశ్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చాక వైద్య రంగం పరుగులు పెడుతోందని ప్రశంసించారు. గతంలో హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ మాత్రమే వుండేవన్నారు. కానీ ఇఫ్పుడు హైదరాబాద్‌లో 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. నగరానికి సమీపంలో భారీ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీని వల్ల కేంద్రాన్ని అడగకుండానే అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగిద్దామన్న ఆయన.. మోసపోతే, గోస పడతామన్నారు. మేము చెప్పింది చేస్తామని, మాట తప్పమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ఐపాస్‌ను తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. తెలంగాణ బిడ్డలే ఈ రోజు దేశానికి, ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఫార్మా, ఫౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగిందని తెలిపారు. 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చేలా సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని కేసీఆర్ వెల్లడించారు. పెట్టుబడిదారులకు 24 గంటలు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా వున్నామని సీఎం పేర్కొన్నారు.