మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌పై మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆదివారం పార్టీ నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన కారణంగానే కొల్లును హత్య కేసులో ఇరికించారని చంద్రబాబు ఆరోపించారు. రవీంద్ర చీమకు కూడా అపకారం చేయరని... ఆయనను ఎలాగైనా ఈ కేసులో ఇరికించేందుకే కాల్స్ డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read:చంద్రబాబుకు అవంతి సవాల్: ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని.. రెండు కుటుంబాల మధ్య కక్షలను రెచ్చగొట్టింది అధికారపక్షేమేనని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు. 13 నెలలు కావొస్తున్నా వైఎస్ వివేకానంద హంతకులను పట్టుకోలేకపోయారని చంద్రబాబు విమర్శించారు.

టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇంతవరకు పేదలకు అందించలేదని, టీడీపీపై కక్షతోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. హౌసింగ్ పెండింగ్ బిల్లులు, ఇళ్ల స్వాధీనంపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Also Read:పక్కా ఆధారాలతోనే కొల్లు రవీంద్ర అరెస్ట్: భాస్కరరావు హత్య కేసుపై ఎస్పీ వివరణ

ఇళ్ల నిర్మాణంలో వైసీపీ వేధింపులపై రేపు నిరసనలు తెలపాలని పార్టీ నేతలకు సూచించారు. ఇళ్ల స్థలాల్లో వైసీపీ అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 7న నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.