విశాఖపట్టణం: చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ ఉంటే విశాఖలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖ రాజధానిపై రెఫరెండానికి సిద్దం కావాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివారం నాడు మంత్రి  అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానులపై ప్రజలే నిర్ణయం తీసుకొంటారన్నారు. అమరావతిపై చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతిపై ప్రేమ ఉంటే ఐదేళ్లలో ఎన్ని భవనాలు నిర్మించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

అమరావతిపై టీడీపీకే ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నారని ఆయన విమర్శించారు. అమరావతి విషయమై నిన్న చంద్రబాబునాయుడు జూమ్ ఆర్గనైజ్డ్ పోరాటం చేయించారని ఆయన సెటైర్లు వేశారు.

పురంధేశ్వరీని విశాఖ ప్రజలు ఎంపీగా గెలిపించారని ఆయన గుర్తు చేశారు. సబ్బం హరికి రాజకీయ భిక్ష పెట్టింది కూడ విశాఖపట్టణం అనే విషయాన్ని ఆయన మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్  వల్లే ఆయన విశాఖలో ఎంపీగా గెలిచారని మంత్రి అవంతి శ్రీనివాస్ గుర్తు చేశారు. చంద్రబాబుకు అన్ని పార్టీల్లో తన మనుషులు ఉంటారని ఆయన పరోక్షంగా బీజేపీలోని కొందరు నేతలపై విమర్శలు చేశారు.