Chandrababu Bail : స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్... మరి ఆ కేసుల సంగతేంటి?.. నేడు హైకోర్టు విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబుకు బెయిల్ లభించగా... ఇవాళ మరో రెండు కేసుల్లో బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగనుంది.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన ఆయన అనారోగ్య కారణాలతో ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. షరతులతో కూడిన ఈ బెయిల్ గడువు ముగుస్తుండటంతో ఆందోళనకు గురవుతుండగా తాజాగా హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇక చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని... కానీ మద్యంతర బెయిల్ షరతులను ఈ నెల 28వరకు పాటించాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 29 నుండి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించవచ్చిన సూచించింది.
ఇదిలావుంటే చంద్రబాబుపై ఒక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసే కాదు అనేక అవినీతి కేసులు పెట్టింది వైసిపి ప్రభుత్వం. ఈ కేసుల విచారణ కూడా ఏపీ హైకోర్టు, ఏసిబి కోర్టుల్లో కొనసాగుతున్నాయి. ఇలా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటకే ఈ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
అయితే ఈకేసులో రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కానీ అరెస్ట్ కాకుండానే రెగ్యులర్ బెయిల్ పై విచారించలేమంటూ ఈ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ముందుస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసారు బాబు తరుపు న్యాయవాదులు. ఈ పిటషన్ పై నేడు హైకోర్టు విచారించనుంది.
ఇదిలావుంటే గత టిడిపి హయాంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని సిఐడి ఆరోపిస్తోంది. ఇందులో ఆనాటి సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర లది కీలక పాత్రగా పేర్కొంటూ ఇద్దరిపై కేసు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు దాఖలుచేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది.
గత టిడిపి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చారంటూ ప్రస్తుత ఏపిబిసియల్ ఎండి పిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదుకాగా చంద్రబాబు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ ఇవాళ హైకోర్టులో జరగనుంది.