వరద బాధితులకు సహాయం చేయండి.. కదలి రండి.. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కదలి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, మందులు అందించాలని అన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంతాల్లో పర్యటించాలని పార్టీ నేతలకు సూచనలు చేశారు. తాను కూడా త్వరలో పర్యటన చేయనున్నట్టు టెలికాన్ఫరెన్స్‌లో వివరించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాన్ని వర్షాలు(Heavy Rains) అతలాకుతలం చేశాయి. చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. రహదారులు నీట మునిగిపోయాయి. ఈ వరద(Floods) నీరు ప్రాజెక్టులకు పోటెత్తుతున్నది. దీంతో కొన్ని డ్యాముల నుంచి నీరు విడిచే పరిస్థితులు ఉన్నాయి. కడప జిల్లాలోని మైలవరం డ్యామ్ నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. అందరూ కదిలి వచ్చి సహాయ చర్యల్లో తలమునకలు కావాలని అన్నారు.
Chandrababu Naidu ఈ రోజు టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలు సహా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని అన్నారు. ఈ జిల్లాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉన్నదని తెలిపారు. భారీ వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకున్న జిల్లాల్లో టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని ఆయన పిలుపు ఇచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని సూచించారు. పసిపిల్లలకు పాలు, బిస్కెట్స్ వంటి ఆహార పదార్థాలు అందించి ఆకలి తీర్చాలని అన్నారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్, టీడీపీ, ఐటీడీపీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆహారం, మందులు పంపిణీ జరుగుతున్నదని వివరించారు. క్షేత్రస్థాయిలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు.
Also Read: Weather Update : ఈ రోజు కూడా రాయలసీమలో భారీ వర్షాలు
ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో టీడీపీ ఎల్లప్పుడూ ముందే ఉంటుందని ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం కంటే తమ పార్టీ శ్రేణులే ముందుగా వరద బాధితులకు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచనలు చేశారు. ఈ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకునే వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేతలు పర్యటించాలని అన్నారు. తాను కూడా త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారని వివరించారు.
Also Read: ఏపీలో భారీ వర్షాలు, వరదలు: ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం.. పలు రైళ్లు రద్దు
కాగా, రాష్ట్రంలో భారీ వర్షాలు పడి వరదలు పోటెత్తుతుంటే ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. అంతేకాదు, ప్రజల ప్రాణాలు పోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని మండిపడ్డారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజలు అవస్థలు పడుతున్న వరదలపై దృష్టి పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు వేయించడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవడంలో సీఎంకు లేదని ఆరోపణలు చేశారు. వరదలతో పంట, ఆస్తి నష్టం జరిగి రైతులు, ప్రజలు సహాయ హస్తాల కోసం చూస్తున్నారని అన్నారు. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని సూచనలు చేశారు.
భారీ వర్షాలు కడప జిల్లా (kadapa district) రాజంపేటలో (rajampet) తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. మూడు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకున్న ఘటనలో ఇప్పటివరకు 12 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.