అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. నారాయణ హృదయాలయకు చేరుకున్న చంద్రబాబు, పురంధేశ్వరి
గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి అత్యంత విషమంగా వుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరీలు బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చేరుకున్నారు

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి అత్యంత విషమంగా వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆరోగ్య పరిస్ధితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. ఈ క్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. నిన్నటి నుంచి నందమూరి బాలకృష్ణ ఆసుపత్రిలోనే వుంటూ చికిత్సతో పాటు కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. తాజాగా శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరీలు నారాయణ హృదయాలయకు చేరుకున్నారు. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగళూరుకు రానున్నారు.
అంతకుముందు మధ్యాహ్నం ఆస్పత్రి వైద్యులు తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలిపారు. జనవరి 27న కుప్పంలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారని.. అక్కడి ఆస్పత్రులలో చికిత్స అందించారని చెప్పారు. అతని పరిస్థితిని అంచనా వేసేందుకు నారాయణ హృదయాలయ నుంచి నిపుణుల బృందం కుప్పంకు వెళ్లిందని పేర్కొన్నారు. ఆ సమయంలో అతడిని తమ ఆస్పత్రికి బదిలీ చేయమని అడగడం జరిగిందని చెప్పారు. జనవరి 28న తెల్లవారుజామున 1 గంటకు తారకరత్నను తమ ఆస్పత్రికి తీసుకురావడం జరిగిందని తెలిపారు.
ALso REad: తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్న వైద్యులు..
కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లు, ఇతర నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టుగా వైద్యులు చెప్పారు. తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్తిమ శ్వాస కొనసాగుతున్నట్టుగా తెలిపారు.
అసలేం జరిగిందంటే..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభించారు. లోకేష్ వెంట బాలకృష్ణ, తారకరత్నలు కూడా ఉన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని దేవాలయాలు, మసీదు, చర్చిలను లోకేష్ సందర్శించారు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు రాగానే ఒక్కసారిగా తారకరత్నకు కళ్లు తిరిగి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే అక్కడి వారు తారకరత్నను వాహనాల్లో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సమీపంలోని పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు నటుడికి సీపీఆర్, యాంజియోగ్రామ్ చేశారు.