హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కరోనాతో చనిపోయిన మరుసటి రోజు ఆయన భార్య లక్ష్మి కూడా మృతిచెందారు. నిన్న(మంగళవారం) ఎస్వీ ప్రసాద్ చనిపోగా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఆయన భార్య లక్ష్మి కన్నుమూశారు. ఆమె మృతిపై టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. 

''ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మరణం మరువక ముందే ఆయన సతీమణి లక్ష్మి మృతి చెందడం అత్యంత బాధాకరం. కరోనాతో నిన్న ఎస్వీ ప్రసాద్ గారు మరణించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడి తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కదిలించింది. దంపతులు కరోనా రక్కసికి బలికావడం హృదయవిదారకం. వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. లక్ష్మీ గారి మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

read more  ఎస్వీ ప్రసాద్ మృతిపై కేసీఆర్, చంద్రబాబు, అచ్చెన్న, నాదెండ్ల సంతాపం

బుధవారం తెల్లవారుజామున 3 గంటలకి ఎస్వీ ప్రసాద్ భార్య లక్ష్మి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్వీ ప్రసాద్ మృతి చెంది ఒక్కరోజు కూడా గడవక ముందే ఆయన సతీమణి కూడా   చనిపోవడం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. 

కొద్దిరోజుల క్రితం ఎస్వీ ప్రసాద్ తో పాటు ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు వర్థన్, శైలేష్ కొవిడ్ బారిన పడ్డారు. తొలుత భార్యభర్తలు సోమాజి గూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.పరిస్థితి విషమించడంతో మంగళవారం ఎస్వీ ప్రసాద్, బుధవారం వేకువ జామున లక్ష్మి మృతి చెందారు. ఇద్దరు కుమారుల ఆరోగ్యం నిలకడగా ఉంది.