హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎస్.వి.ప్రసాద్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.వి.ప్రసాద్ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసాద్ అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన అకాల మరణం  తీరనిలోటన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. 

కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని... ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగా ,విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్ విశేషమైన సేవలందించారని.... ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌చైర్మన్‌గా ఆయా సంస్థల బలోపేతం కోసం కృషి చేశారని తెలిపారు. ఎస్వీ ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు చంద్రబాబు. 

read more  కరోనా సోకి.. మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ కన్నుమూత

జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కూడా ఎస్.వి.ప్రసాద్ అకాల మరణంపై సంతాపం తెలిపారు. విశ్రాంత ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ ఎస్.వి.ప్రసాద్ తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి సమర్థుడైన అధికారిగా అందరి మన్ననలు ప్రసాద్ పొందారన్నారు. ల్యాండ్ రెవెన్యూ, విద్యుత్ శాఖలలో కీలక హోదాల్లో పని చేసి తన ముద్ర వేశారని పేర్కొన్నారు. 

''ఎస్వి ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది. శాసన సభ్యుడిగా, శాసన సభాపతిగా ఉన్న సమయంలో శ్రీ ప్రసాద్ గారితో సమావేశమవుతూ ఉండేవాణ్ణి. పాలన వ్యవహారాలపై ఎంతో పట్టు ఉన్న ఆయన ఏ బాధ్యతల్లో ఉన్నా నిబద్ధతతో పని చేశారు. శ్రీ ఎస్.వి.ప్రసాద్ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను'' అని నాదెండ్ల ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలుగుదేశం ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా ఎస్వి ప్రసాద్ మరణంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  ప్రసాద్ మృతి పట్ల సంతాపం తెలియజేసున్నాను. కరోనాతో చికిత్స పొందుతూ మరణించడం బాధాకరమన్నారు. నిబద్ధత కలిగిన ఉన్నతాధికారిగా ఎస్వీ ప్రసాద్ కు గుర్తింపు పొందారన్నారు. ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అచ్చెన్న తెలిపారు.