Asianet News TeluguAsianet News Telugu

వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే కుట్ర: జగన్ మీద కళా వెంకట్రావు

తమ పార్టీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్టు చేయడాన్ని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఖండించారు. బీసీ నేతలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే కుట్ర చేస్తున్నారని కళా వెంకట్రావు జగన్ మీద విరుచుకుపడ్డారు.

TDP AP president Kala Venkat Rao condemns Kollu ravindra arrest
Author
Amaravathi, First Published Jul 4, 2020, 8:43 AM IST

అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై అక్రమంగా హత్య కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్నితెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఖండించారు.  పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగితే దాన్ని రవీంద్రకు ఆపాదిస్తారా అని ఆయన అడిగారు.  కొల్లు రవీంద్ర సౌమ్యుడు, మృదుస్వభావి, నిరంతరం ప్రజా క్షేమం కోసం పాటుపడేవ్యక్తి అని ఆయన అన్నారు.  మచిలీపట్నం నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ది, ప్రజలకు ఆయన చేసిన సేవల గురించి ఆ ప్రజలే  చెప్తారని, 

జగన్ ప్రభుత్వ పాలన వైపల్యాలను, జగన్ అవినీతిని ప్రశ్నించిన టీడీపీ నాయకులపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  బీసీలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టే కుట్రచేస్తున్నారని ఆయన అన్నారు.  అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణ, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర వంటి బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, 

ఆర్ధిక నేరస్తులకు ఆంధ్రప్రదేశ్ ని అడ్డాగా మార్చిఅంతర్జాతీయ ఆర్ధిక నేరస్థుడుగా  రాష్ట్రం పరువుతీసిన నాయకుడు  నేడు అందరిని అవినీతిపరులుగా ,ఆర్ధిక నేరస్తులుగా చిత్రించాలని  అక్రమ కేసులతో అణచి వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  

వైసీపీ ప్రభుత్వం అడ్డదారిలో అరాచకం సృష్టిస్తూ ప్రత్యర్ధుల పై ప్రతీకారం తీర్చుకొనేందుకు  తప్పుడు కేసులు బనాయిస్తూ టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధింపులకు గురిచేస్తోందని కళా వెంకట్రావు విమర్శించారు. 

బాధితులకు న్యాయం చేసేందుకు ఏర్పాటు చేసిన  ప్రత్యేక చట్టాలు నిర్భయ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి నిరోధక చట్టం, దిశా చట్టం, అన్నింటినీ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై  ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని  దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్ పాలనలో ప్రజలవలన,ప్రజల చేత,ప్రజలకొరకు అంటున్న ప్రజాస్వామ్య సూత్రాలు దిక్కులేనివి అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు 
          
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించిన వారిపై  పై ఈ క్రూరత్వం ఏమిటని ఆయన అడిగారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రశ్నించేవారు, వారు వుండవద్దు అంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకని ఆయన నిలదీశారు. రాజ్యాంగం ఎందుకని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదు అన్న సంగతి జగన్, వైసీపీ నేతలు, పోలీసులు గుర్తు పెట్టుకోవాలని కళా వెంకట్రావు అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios