Asianet News TeluguAsianet News Telugu

‘సర్కారు వారి దొంగలు’ పథకం... లబ్దిదారులు ఎవరంటే..: అచ్చెన్నాయుడు ఎద్దేవా

అధికారంలోకి వచ్చీ రాగానే సరస్వతి సిమెంట్స్ లీజు గడువుల్ని పెంచిన జగన్ ఇప్పుడు ఇండియా సిమెంట్స్ లీజు గడువును ఏకంగా 50 సంవత్సరాల పాటు పెంచుతూ ఉత్తర్వులివ్వడాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టాడు.

tdp ap chief atchannaidu serious on cm ys jagan akp
Author
Amaravati, First Published Jun 16, 2021, 1:51 PM IST

అమరావతి: తండ్రి హయాంలో క్విడ్ ప్రో కో విధానంతో వేల కోట్లు వెనకేసుకున్న జగన్ రెడ్డి... అధికారంలోకి వచ్చినప్పటి నుండి క్విడ్ ప్రో కో-2కు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసిపి అధికారాన్ని చేపట్టిన ఈ రెండేళ్లలో ఏ వర్గానికీ సరైన లబ్ది చేకూరలేదు... రాష్ట్రంలో పైసా అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. రూపాయి పెట్టుబడితో ఒక్క కంపెనీ కూడా రాలేదు కానీ  జగన్ కేసుల్లో ఉన్న నిందితులు, కంపెనీలకు మాత్రం భారీ లబ్ది చేకూరిందని అచ్చెన్న ఆరోపించారు. 

''అధికారంలోకి వచ్చీ రాగానే సరస్వతి సిమెంట్స్ లీజు గడువుల్ని పెంచారు... ఇప్పుడు ఇండియా సిమెంట్స్ లీజు గడువును ఏకంగా 50 సంవత్సరాల పాటు పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. తన అక్రమాస్తుల కేసుల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు కట్టబెట్టడం, కంపెనీలకు కాంట్రాక్టులు దోచిపెట్టడమే లక్ష్యంగా జగన్ అడుగులేయడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి అధికారం కోసం తాపత్రయపడింది ప్రజలకు సేవ చేయడానికా లేక.. తన కేసుల్లోని వారిని ప్రభావితం చేయడానికా.?'' అని నిలదీశారు. 

''తన ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న అరబిందోకు కాకినాడ పోర్టు, అంబులెన్సుల కాంట్రాక్టు కట్టబెట్టారు. హెటిరోకు విశాఖలో బేపార్క్ వంటి విలువైన భూములు దారాదత్తం చేశారు. రాంకీ ఫార్మా అధినేతను రాజ్యసభకు పంపించారు. వాన్ పిక్ లో కీలక నిందితుడు నిమ్మగడ్డను సెర్బియాలో అరెస్టు చేస్తే.. కేంద్ర మంత్రులందరినీ కలిసి విడిపించే ప్రయత్నం చేశారు. పెన్నా సిమెంట్స్ కు కర్నూలులో గల గనుల లీజును 2035 వరకు పొడిగించారు. తన కేసుల్లో ఉన్న నిందితులను ప్రత్యేకంగా ఏపీకి రప్పించి మరీ ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు'' అని ఆరోపించారు. 

read more  ఎన్నికలపుడు మేనమామ... అయిపోయాక మెంటల్ మామ: సీఎం జగన్ పై లోకేష్ ఫైర్

''వర్షం పడగానే పుట్టలోంచి పాములు బయటకొచ్చినట్లు.. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు అప్పటి వరకు ఉన్నాయో లేదో కూడా తెలియని కంపెనీలు, వ్యక్తులు బయటికొచ్చారు. జగన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి.. తన కేసుల్లో ఉన్న వారికి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు. సర్కారు వారి దొంగలు అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి తన కేసుల్లో వారికి రాష్ట్ర సంపదను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు'' అంటూ మండిపడ్డారు. 

''జగన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల బతుకుల కంటే తన కేసుల్లో ఉన్న కంపెనీలు, వ్యక్తుల ప్రయోజనాలు కాపాడడం, వారికి రాష్ట్రాన్ని దోచిపెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చింది.. రాష్ట్రంలో ఏ రంగాన్ని కూడా వదలకుండా దోచేయడానికేనా.? క్విడ్ ప్రో కోకు సహకరించిన ఎంతో మంది అధికారులు జైలుకెళ్లారు. ఇప్పుడు క్విడ్ ప్రో కో-2కు సహకరిస్తున్న అధికారులకూ అదే గతి తప్పదని గుర్తుంచుకోవాలి. అధికారులు అవినీతి పరుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని గుర్తుంచుకోవాలి'' అని అచ్చెన్న హెచ్చరించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios