Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికలపుడు మేనమామ... అయిపోయాక మెంటల్ మామ: సీఎం జగన్ పై లోకేష్ ఫైర్

''ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు-విద్యా సంవత్సరం వృధా'' అనే అంశం పై విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులతో లోకేష్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు.

nara lokesh satires on cm ys jagan  akp
Author
Amaravati, First Published Jun 16, 2021, 12:51 PM IST

అమరావతి: ఎన్నికల ముందు జగన్ రెడ్డి  రాష్ట్రంలో ఉన్న పిల్లలకు మేనమామగా అండగా ఉంటానని హామీ ఇచ్చి ఇప్పుడు మెంటల్ మామగా తయారయి వారిని వేధిస్తున్నాడని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. దేశమంతా పరీక్షలు వద్దు, ప్రాణాలే ముద్దు అంటుంటే ఈ మెంటల్ మామ మాత్రం పరీక్షలు ముద్దు, ప్రాణాలు అంటే లెక్కలేదు అంటున్నాడని అన్నారు.   

''ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు-విద్యా సంవత్సరం వృధా'' అనే అంశం పై విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులతో లోకేష్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని దేశ ప్రధాని మోదీతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరీక్షలు రద్దు చేసారన్నారు. సిబిఎస్‌ఈ, ఐసిఎస్‌ఇలతో పాటు 15 రాష్ట్రాలు ఇప్పటివరకు 10, 11, 12 తరగతులకు పరీక్షలను రద్దు చేశాయని గుర్తుచేశారు. 

''దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. 18.20 లక్షల కరోనా కేసులు,12,052 మంది చనిపోయారు. పాజిటివ్ రేట్ ఇంకా 6% ఉంది అని ప్రభుత్వమే ప్రకటించింది. అధికారిక లెక్కలు అలా ఉంటే, సాధారణ మరణాల స్థాయికంటే ఎక్కువుగా వుంది. ఒక్క మే నెలలోనే 5 రెట్లు ఎక్కువుగా మరణాలు నమోదయ్యాయని,1.30 లక్షల మంది ఒక్క మే నెలలోనే చనిపోయారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టే ప్రభుత్వ లెక్కలు దొంగ లెక్కలు అని మనకి అర్ధమవుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే తాడేపల్లి మెంటల్ మామ మాత్రం పరీక్షలు పెట్టి పిల్లలు, తల్లితండ్రుల ప్రాణాలు తీస్తా అని అంటున్నారు'' అనిమండిపడ్డారు. 

read more ''2008 డిఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్... ఎస్జీటీలుగా నియమించేందుకు సీఎం ఆమోదం''

''పరీక్షలు పెట్టకపోతే విద్యావ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది అని లెక్చర్ ఇస్తున్నారు. రెండేళ్లలో ఈయన పీకింది ఏమైనా ఉందా అంటే అదీ లేదు. నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నాణ్యమైన విద్య అందించడంలో స్టేట్ ర్యాంక్ 19వ స్థానానికి పడిపోయింది. చంద్రబాబు హయాంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లో ఏపీ 3వ స్థానంలో ఉండేది.ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల 600 మంది ఉపాధ్యాయుల మృతి చెందారు'' అని పేర్కొన్నారు. 

''పదో తరగతి పిల్లలకు ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్లకు ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వ వాదన. పోయిన ఏడాది మాదిరిగానే ఆర్జియూకేటి ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు చెప్పట్టారు. ఈ ఏడాది కూడా అలానే చెయ్యొచ్చు. పదో తరగతి పిల్లలకు సమ్మేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వాటిని ఆధారంగా చేసుకొని గ్రేడింగ్ ఆధారంగా విద్యార్థులను పాస్ చెయ్యొచ్చు. ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు చెయ్యలేం అని ప్రభుత్వం అంటుంది. కానీ ఇంటర్ మార్కులకు వెయిటేజ్ రద్దు చేసి ఎంసెట్ ర్యాంకింగ్ ఆధారంగా అడ్మిషన్లు చెయ్యొచ్చు. పక్క రాష్ట్రం తెలంగాణ ఇదే విధానం అమలు చేస్తోంది'' అంటూ ప్రభుత్వానికి సూచనలిచ్చారు. 

''ఇప్పటికే పై తరగతులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమైయ్యాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాలా? పై తరగతుల క్లాసులకు అటెండ్ అవ్వాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ని చూస్తే జాలేస్తుంది. మనస్సులో జగన్ రెడ్డిని తిట్టుకుంటారు. బయటకి నన్ను తిడతారు. ఏ రోజు ఎం మాట్లాడతారో ఆయనకే తెలియదు. పరీక్షలు పెడతాం అని ఒక సారి,పెడతామో లేదో తెలియదు అని ఒక సారి. సమయం సరిపోకపోతే పరీక్షలు నిర్వహించం అని ఒక సారి. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు పెట్టి తీరుతాం అని మరోసారి. ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మంత్రి కాదు,కన్ఫ్యూజన్  డిపార్ట్మెంట్ కి మంత్రి'' అని లోకేష్ ఎద్దేవా చేశారు. 

''జూలై పరీక్షలు పెట్టే అవకాశం అని మళ్లీ నిన్న ప్రకటించారు. అసలు ఈ ప్రభుత్వానికి మతి ఉందా? విద్యార్థులు,తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండటం ఈ మెంటల్ మామ కు ఇష్టం లేదా? ప్రాణాలు పోతాయనే భయం ఒక పక్క, విద్యా సంవత్సరం వృధా అవుతుంది అనే భయం మరో పక్క విద్యార్థులను, తల్లిదండ్రులను వెంటాడుతుంది. అన్ని రాష్ట్రాలు పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయటం వలన, అక్కడ పిల్లలు తరువాత తరగతులకు, అలాగే వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కు రెడీ అవుతున్నారు. మన రాష్ట్రంలో మాత్రం మెంటల్ మామ మూర్ఖపు చేష్టల వల్ల ఇంకా పాత అకాడమిక్ ఇయర్ లోనే ఉన్నాం. పరీక్షలు ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఇప్పటికీ జూన్ నెల అయిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియ అయ్యే సరికి అక్టోబర్, నవంబర్ అవుతుంది. సీఎం నిర్ణయంతో, మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు, ఒక అకడమిక్ ఇయర్ కోల్పోతున్నారు. అలాగే తరువాత ఏడాది జరిగే తరగతులు మిస్ అవుతున్నారు. అంతే కాకుండా, పోటీ పరీక్షల్లో వెనుకపడిపోతున్నారు'' అని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios