జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ప్రధాన పార్టీలు ఏమాత్రం లెక్క చేయలేదు. శుక్రవారం జరిగిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటి సమావేశానికి టిడిపి, వైసిపి ప్రతినిధులెవరూ హాజరుకాలేదు. దాంతోనే రెండు పార్టీలు పవన్ ను ఎంత లైట్ గా తీసుకున్నాయో అర్దమైపోతోంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఏపికి అవసరమైన నిధులు ఇస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. నిధులివ్వకుండానే ఇచ్చినట్లు అబద్దాలు చెబుతోందని రాష్ట్రం ఆరోపిస్తోంది.

ఈ నేపధ్యంలోనే లెక్కలపై లెక్క తేల్చే ఉద్దేశ్యంతో పవన్ జెఎప్సీని ఏర్పాటు చేసి గురువారం నాటికి లెక్కలివ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అల్టిమేటమ్ జారీ చేశారు. అయితే రెండు ప్రభుత్వాలూ లెక్కచేయలేదనుకోండి అది వేరే సంగతి. ఆ లెక్కల కోసమే శుక్ర, శని వారాల్లో పవన్ మేధావులు, అఖిలపార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పై రెండు ప్రధాన పార్టీల నుండి తప్ప మిగిలిన పార్టీల నుండే కాక జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణ, చలసాని శ్రీనివాస్, పద్మనాభయ్య లాంటి మేధావులు, న్యాయనిపుణులు హాజరయ్యారు.

పవన్ కల్యాణ్ ఆ రెండు పార్టీలకు ఆహ్వానించలేదన్న వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన పవన్.. సమావేశానికి తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను కూడా ఆహ్వానించినా వారు రాలేదని అందుకు కారణాలు తనకు తెలియవన్నారు. ఏపీకి విభజన హామీల అమలు విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు వాళ్ల పంథాలో పోరాడుతూనే ఉన్నారని పవన్ తెలిపారు. ఇప్పటికి అర్ధమయ్యే ఉంటుంది చంద్రబాబునాయుడు ఉద్దేశ్యం. ఎందుకంటే, టిడిపి సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ ‘పవన్ మానోడె లైట్ గా తీసుకోండి’ అని వ్యాఖ్యానించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.