తమంతట తాముగా టిడిపితో పొత్తు ఎందుకు తెంచుకోవాలన్నది భాజపా కేంద్ర నాయకత్వం ఆలోచన. ఆ నిర్ణయమేదో ముందు చంద్రబాబే తీసుకుంటే మంచిది కదా అని జాతీయ నాయకత్వం యోచిస్తోంది. అంటే పొత్తు వద్దు అన్న నిర్ణయాన్ని ముందు ఎదుటి వారే తీసుకోవాలని రెండు పార్టీలూ వేచి చూస్తున్నాయన్నమాట.
ఎవరు ముందు? రాష్ట్రంలోని మిత్రపక్షాలుగా అధికారంలో ఉన్న టిడిపి-భాజపా నేతల్లో మెదులుతున్న ప్రశ్న. రెండు పార్టీల మధ్య గతంలో ఉన్నంత సఖ్యత ఇపుడు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తుండదని ప్రచారం జరుగుతోందన్న విషయం అందరికీ తెలిసిందేకదా. రెండు పార్టీలూ విడిపోవాలంటే ఎవరు ముందు నిర్ణయం తీసుకోవాలి? ఇపుడదే ప్రశ్న ఇరు పార్టీల అగ్రనేతల మధ్య దోబూచులాడుతోందట.
అసలే అంతంత మాత్రంగా ఉన్న రెండు పార్టీల మధ్య సంబంధాలు, మొన్న జగన్-ప్రధానమంత్రి భేటీ తర్వాత మరింత క్షీణించాయి. ఆ సందర్భంగా భాజపా-టిడిపి నేతల మధ్య జరిగిన మాటల యుద్ధం భవిష్యత్ పరిణామాలను కళ్ళకు కట్టింది. అయితే, ఆ ముహూర్తం ఎప్పుడన్నదానిపైనే ఇరు పార్టీల నేతల్లోనూ చర్చ జరుగుతోంది. అదికూడా ముందు ఎవరు నిర్ణయం తీసుకుంటారన్నదానిపైనే ఆధారపడివుంది.
ఇరు పార్టీల మద్య పొత్తు వద్దు అని ముందుగా ఎవరు ప్రకటిస్తారన్న విషయంపై ఇరు పార్టీల నేతలూ ఎదురు చూస్తున్నారు. ముందు చంద్రబాబే నిర్ణయం తీసుకుంటే, వెంటనే ఇబ్బందులు మొదలవుతాయి. ఆ విషయం ముఖ్యమంత్రికి బాగా తెలుసు. కాబట్టే ఢిల్లీలో పరిస్ధితులు ఆశాజనకంగా లేకపోయినా ఏదో నెట్టుకొస్తున్నారు. భాజపాతో పొత్తును తనంతట తానుగా వదులుకునే స్ధితిలో చంద్రబాబు లేరు.
ఇక, భాజపా స్ధానిక నేతల్లో కొందరు టిడిపితో పొత్తు వద్దని పదే పదే స్పష్టం చేస్తున్నారు. మూడేళ్ళ పాలనలో చంద్రబాబుపై ప్రజావ్యతిరేకత పెరిగిపోయిందని, ఇంకా ఉపేక్షిస్తే ఆ మసి తమకు కూడా అంటుకుంటుందని చెబుతున్నారు. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో స్పష్టంగా కనబడుతుందని భాజపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, తమంతట తాముగా టిడిపితో పొత్తు ఎందుకు తెంచుకోవాలన్నది భాజపా కేంద్ర నాయకత్వం ఆలోచన. ఆ నిర్ణయమేదో ముందు చంద్రబాబే తీసుకుంటే మంచిది కదా అని జాతీయ నాయకత్వం యోచిస్తోంది. అంటే పొత్తు వద్దు అన్న నిర్ణయాన్ని ముందు ఎదుటి వారే తీసుకోవాలని రెండు పార్టీలూ వేచి చూస్తున్నాయన్నమాట. భాజపాతో పొద్దు వద్దనుకుంటే చంద్రబాబుకు జనసేన ప్రత్యామ్నాయంగా ఉన్నట్లు సమాచారం. మరి, భాజపాకు ప్రత్యామ్నాయం ఏముంది? వేచి చూడాల్సిందే.
