కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి వర్గానికి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై టిడిపి వర్గీయులు రాళ్ళదాడికి దిగడంతో ఆరుగురు గాయపడ్డారు.
మచిలీపట్నం: అధికార వైసిపి (YSRCP) వర్గీయులపై ప్రతిపక్ష టిడిపి (TDP) వర్గీయులు దాడికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా (krishna district)లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి వైసిపి-టిడిపి నాయకుల కుటుంబాల మధ్య గొడవ మొదలై ఓ వర్గంవారు మరో వర్గంపై రాళ్ళదాడికి దారితీసింది. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది.
వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం గరాలదిబ్బ గ్రామానికి చెందిన వైసిపి వర్గానికి చెందిన ఓ నాయకుడికి టిడిపి వర్గానికి చెందిన నాయకుడితో వైరం వుంది. వీరు తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగా ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలోనే ఆగ్రహంతో రగిలిపోయిన టిడిపి నాయకుడి కుటుంబసభ్యులు వైసిపి వర్గీయులపై రాళ్లదాడికి దిగారు. దీంతో రాళ్లు తగిలి అధికార పార్టీ నాయకుడి కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహిళలని కూడా చూడకుండా రాళ్లతో గాయపర్చారు.
Video
ఈ రాళ్లదాడిలో గాయాలపాలైన ఆరుగురిని మచిలీపట్నం హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుండటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. దీంతో గ్రామానికి చేరుకున్న మచిలీపట్నం పోలీసులు రాళ్లదాడికి పాల్పడిన తొమ్మిదిమంది టిడిపి వర్గీయులను అరెస్ట్ చేసారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పికెటింగ్ ఏర్పాటుచేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బందరు పోలీసులు తెలిపారు.
