Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై ఫైట్: చంద్రబాబు తురుపు ముక్క జూ.ఎన్టీఆర్

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు...’ గీతానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీనికి ఎన్టీఆర్ థ్యాంక్యూ మావయ్య రిప్లయ్ ఇచ్చారు. 

tdp activists feeling happy about jr ntr reply to chandra babu naidu
Author
First Published Jan 11, 2023, 6:29 PM IST

తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తర్వాత దిక్కెవరు? ప్రస్తుతం ఈ చర్చ ఆ పార్టీలోనే కాదు, ఏపీలోని అన్ని పార్టీల్లోనూ జోరుగా జరుగుతోంది. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుస ఓటములకు తోడు.. కీలక నేతలు, పార్టీకి ఎప్పటి నుంచో కొమ్ముకాస్తూ వస్తున్న కేడర్ చేజారిపోతుండడం పార్టీ అధిష్టానంలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కీలక నేతలంతా వైసీపీ , బీజేపీల్లోకి వెళ్లిపోయారు. టీడీపీ భావి ఆశాకిరణంలా వున్న నారా లోకేష్‌ సమర్థతపై సొంత పార్టీలోనే నమ్మకం లేకపోతుండటంతో కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు వెంట ఉన్న నేతలు ఎవరు అన్నది కూడా అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వేళ్ల పై లెక్కించేంత మంది చంద్రబాబుతో రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్‌లో పాల్గొంటూ ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్న మాట. దీనికి తోడు జగన్ స్పీడ్‌కు హైకమాండ్ ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతుండటంతో టీడీపీ కీలక నేతల్లో కొందరు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ALso REad: వారసులను గెలిపించాలి.. ఇల్లరికపు అల్లుళ్లను కాదు, అన్నగారి వారసుడు జూనియర్ ఎన్టీఆరే : కొడాలి నాని వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా.. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ సీరియస్ అవుతున్నా.. అభిమానుల నుంచి డిమాండ్ ఆగడం లేదు.. ఇంకాస్త పెరుగుతూ వస్తోంది. మొన్నామధ్య కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకే స్వయంగా నిరసన సెగ ఎదురైంది. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను ఎప్పుడు తీసుకొస్తున్నారంటూ కార్యకర్తలు నిలదీశారు. కానీ టీడీపీ చీఫ్.. మాటను దాట వేశారు.

మాస్ ఇమేజ్, తాత ఎన్టీఆర్ పోలికలు, ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకునే తత్వం ఉండటంతో జూనియర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. అయితే 2009 ఎన్నికల తర్వాత జూనియర్ .. పార్టీకి దూరంగా వుంటున్నారు. తన అత్త భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినప్పుడు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసినప్పుడు ఎన్టీఆర్ స్పందన సరిగా లేదంటూ కొందరు నేతలు పెదవి విరిచారు.

ఈ సంగతి పక్కనబెడితే.. 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. చంద్రబాబుకు వయసు పైబడటం, జగన్ దూకుడు, ఇతర పార్టీల నుంచి పోటీ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఆవశ్యకం. ఇందుకోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రదర్శనలు చేస్తుండటంతో పాటు వివిధ కార్యక్రమాలకు ఆయన రూపకల్పన చేశారు. అటు నారాలోకేశ్ కూడా యువగళం పేరుతో సుదీర్ఘ పాదయాత్రకు రెడీ అయ్యారు. అటు జనసేన నుంచి కూడా పొత్తులపై సానుకూల స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ మంచి జోష్‌లో వుంది. దీనిని మరింత పెంచే పరిణామం చోటు చేసుకుంది . అది కూడా జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి.

Also Read: థాంక్యూ మామయ్య.. చంద్రబాబు ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై..

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఆర్ఆర్ఆర్ యూనిట్‌కి అభినందనలు తెలియజేస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా విషెస్ తెలియజేశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘‘థ్యాంక్యూ మావయ్య’’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఇది చూసి టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరపడిపోతున్నారు. తారకరత్న లోకేష్‌తో భేటీ కావడం, టీడీపీ నుంచి పోటీకి సిద్ధమవటం, అటు గతంలో పార్టీని వీడిపోయిన వాళ్లంతా తిరిగి సొంత గూటికి వచ్చేస్తూ వుండటం ఇప్పుడు ఎన్టీఆర్ కూడా చంద్రబాబుపై అభిమానం చూపడం వంటి కారణాలతో తెలుగుదేశం రాష్ట్రంలో బలపడుతోందంటూ శ్రేణులు పొంగిపోతున్నారు. మరి ఇది తాత్కాలికమేనా, లేదంటే ఎన్టీఆర్ కూడా పార్టీ తరపున పనిచేసేందుకు సిద్ధమయ్యారా అన్నది త్వరలోనే తేలిపోనుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios