ఈ మంత్రులకు ఉద్వాసన తప్పదా ?

TDP 2019 formula Naidu to rejig cabinet and depute a couple of ministers to party work
Highlights

వచ్చే మంత్రివర్గ విస్తరణలో పలువురు సీనియర్లకు ఉధ్వాసన తప్పదని ప్రచారం జోరందుకుంటోంది.

వచ్చే మంత్రివర్గ విస్తరణలో పలువురు సీనియర్లకు ఉధ్వాసన తప్పదని ప్రచారం జోరందుకుంటోంది. డిసెంబర్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీలోని చర్చ బాగా జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలోని పలువురు పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, వివిధ వేదికలపై కొందరి పనితీరును ముఖ్యమంత్రి బాహాటంగానే విమర్శించారు. దాంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్పులు, చేర్పులు చేయాలని సిఎం గట్టిగా నిర్ణయించుకున్నారని సమాచారం.

సరే, ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్న విషయంలో స్పష్టత లేకపోయినా తొలగించే వారి విషయంలో మాత్రం కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి జాబితాలో శిద్దా రాఘవరావు, పి. నారాయణ, అఖిలప్రియ, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడిలో ఒకరిని, నక్కా ఆనందబాబు పేర్లు వినబడుతున్నాయి. తొలగించే వారిలో పనితీరు ఆధారంగానే కాకుండా పార్టీ పటిష్టం చేయటం కోసం వాడుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

మంత్రివర్గంలో సీనియర్ అయిన యనమల రామకృష్ణుడు రాజ్యసభకు వెళ్ళిపోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నారు. వచ్చే మార్చిలో ఆయన కోరిక తీరబోతోందని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా గంటా, నారాయణ వియ్యంకులు. ఇద్దిరినీ తప్పిస్తారా అన్నది కూడా చూడాలి.

అచ్చెన్నాయుడు, నారాయణ, శిద్ధా రాఘవరావు, గంటా లేక చింతకాయల్లో ఒకరిని పార్టీ పటిష్టానికి ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. ఎందుకంటే, వారంతా గడచిన మూడున్నరేళ్ళుగా మంత్రులుగా ఉంటున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం పలువురు సీనియర్లు ఎదరుచూస్తున్నారు. ప్రతీసారి ఆశించటం భంగపడటమే జరుగుతోంది. అటువంటి వారిలో బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, గౌతు శ్యామ సుందర్ శివాజి, కాగిత వెంకట్రావు, పతివాడ నారాయణ స్వామి తదితరులున్నారు. చివరి ఏడాదిలోనైనా కొందర సీనియర్లను సంతృప్తి పరచకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు రావచ్చని చంద్రబాబు అనుమానిస్తున్నారట.

అందుకనే సామాజిక వర్గాల వారీగా లెక్కలేసి సీనియర్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటి మంత్రివర్గాన్నే అప్పట్లో ఎన్నికల మంత్రివర్గమని అనుకున్నారు కానీ కాదని తేలిపోయింది. ప్రచారం జరుగుతున్నది నిజమే అయితే, డిసెంబర్లో జరగబోయే మంత్రివర్గ విస్తరణే నిజంగా ఎన్నికల మంత్రివర్గం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, ఎన్నికలకు ఉన్నది ఏడాదిన్నర మాత్రమే.

 

loader