ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరంగా ప్రజలు రెండు కళ్లుగా భావిస్తున్నారని చెప్పారు టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఇవాళ అమరావతిని అనే కంటిని పెరికివేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగిన 2014లో రాజధాని ఎక్కడుందో కూడా తెలియని పరిస్ధితి నెలకొందన్నారు.

రాజధాని ఎంపిక సమయంలో అప్పటి ప్రభుత్వం ప్రాంతీయ విద్వేషాలు వస్తాయేమోనని భయపడిందని నిమ్మల గుర్తుచేశారు. కానీ దానికి భిన్నంగా 13 జిల్లాలకు చెందిన ప్రజలు ఎటువంటి ఆందోళనలు, డిమాండ్లు లేవనెత్తకుండా అమరావతికి ఎంపిక చేశారు. శివరామకృష్ణన్ కమీషన్ సూచించిన విధంగానే తాము రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని నిమ్మల గుర్తుచేశారు.

Also Read:రాష్ట్రాన్ని నాశనం చేసే బిల్లుపై మాట్లాడుతున్నా.. ఏం చేయను: అనగాని

అన్ని ప్రాంతాలకు, జనాభాకు, చట్ట సభ సభ్యులకు సమాన ప్రాంతంలో అమరావతి ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్‌పూలింగ్ విధానంలో 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తుచేశారు. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అమరావతిలోనే భవన నిర్మాణాలకు ఖర్చు తక్కువగా ఉంటుందని మద్రాస్ ఐఐటీ నిపుణులు చెప్పారని రామానాయుడు గుర్తుచేశారు.

బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్‌కు ఎలాంటి చట్టబద్ధత లేదని, అలాంటి కమిటీ రిపోర్టును పట్టుకుని ఐదుకోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తామంటే కుదరదన్నారు. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు 75 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని.. తాడికొండ, నందిగామ, తిరువూరు, పామర్రు వంటి దళిత నియోజకవర్గాల్లో రాజధానిని ఏర్పాటు చేశామని నిమ్మల తెలిపారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంటూ అధికారపక్షం చెప్పిందే చెబుతున్నారని చేతులో అధికారం ఉన్నప్పుడు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా అని నిమ్మల సవాల్ విసిరారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లి మొట్టికాయలు వేయించుకుందని ఆయన దుయ్యబట్టారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని నిమ్మల సవాల్ విసిరారు.

Also Read:రాజధాని రగడ: ఇంకా ఎన్ని గుండెలు ఆగాలి ...? పవన్ కళ్యాణ్ కి స్మిత సూటి ప్రశ్న

అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని.. దీని వల్ల రాష్ట్ర ఖజానాకి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి ప్రాజెక్ట్ వల్ల లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని.. ఖర్చు ఏమాత్రం ఉండదని నిమ్మల తెలిపారు. ప్రజా రాజధానిని, ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించలేకపోతే దానిని వదలివేయాలన్నారు. ఒక్క రెండు వేల కోట్లు ఖర్చు చేయగలిగితే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న భవనాలకు విద్యుత్, రంగులు వేస్తే ఎన్ని సంవత్సరాలైనా పరిపాలన సాగించుకోవచ్చునని నిమ్మల స్పష్టం చేశారు. 

విశాఖపట్నం అంటే మా అందరికీ ఎంతో ఇష్టమని.. హుదుద్ తుఫాన్ సమయంలో హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రికి రోడ్డు మార్గంలో చంద్రబాబు వెళ్లారని నిమ్మల గుర్తుచేశారు. వారం రోజులు బస్సులో పడుకుని అంతా చక్కదిద్దారని రామానాయుడు తెలిపారు. ఆదాని గ్రూప్ 70 వేల కోట్లు పెట్టుబడులు పెడితే విశాఖ అభివృద్ధి చెందుతుందా లేక రెండు బిల్డింగ్‌లు కడితే డెవలప్‌ అవుతుందా అని నిమ్మల ప్రశ్నించారు.

చట్ట ప్రకారం రాజధానిగా కన్ఫర్మ్ అయిన అమరావతిని మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా అని నిమ్మల ప్రశ్నించారు. జగన్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండరని, రేపు కొత్త ముఖ్యమంత్రి వస్తే మళ్లీ రాజధానిని మారుస్తారా అని ఆయన నిలదీశారు. చరిత్రలో ఒక్క తుగ్లక్ మాత్రమే రాజధానిని మార్చారన్నారు.

అమరావతి చుట్టూ రూ.15 వేల కోట్ల అంచనాతో కేంద్రం ఔటర్ రింగ్ రోడ్డుని ప్రతిపాదించిందని దీని భవిష్యత్తు ఏంటని నిమ్మల ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ అద్దె భవనాల్లో పరిపాలన సాగుతోందని రామానాయుడు గుర్తుచేశారు.