అమరావతి: ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టేందుకు నేడు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతుంది. ఈ చర్చ మధ్యలోనే రాష్ట్రానికి మూడు రాజధానుల బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 

ఈ బిల్లు ఇలా ప్రవేశ పుట్టిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నేటి సాయంత్రం మంగళగిరిలో పార్టీ ఆఫీసులో సమావేశానికి పిలుపునిచ్చారు. తొలుత అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, కొన్ని రోజులుగా రాజధాని రైతులపై నోరు మెదపలేదు. (బహుశా, ఆయన పొత్తులు కుదుర్చుకోవడంలో బిజీగా ఉన్నాడేమో)

ఇక పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత స్పందిస్తానని చెప్పిన నేపథ్యంలోనే నేడు ఈ పార్టీ కార్యకర్తల సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పాప్ సింగర్ స్మిత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ రాజధాని విషయంలో స్పందించమని కోరింది. 

పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజైనా మేము మీవైపు నుండి అమరావతి రైతులపై స్పందనను ఆశించవచ్చా అని అడిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో 20 మంది అధికారిక లెక్కల ప్రకారమే అసువులు బాసారని, ఈ బిల్లు వల్ల ఇంకెవ్వరి ప్రాణం పోకూడదని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

పవన్ కళ్యాణ్ తాజా బీజేపీ పొత్తు తరువాత ఇప్పుడు వారు తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఒకపక్క ఉద్యమం చేయాలనున్నప్పటికీ కూడా మరోపక్క తాను ఉద్యమం చేసినప్పటికీ ఆ క్రెడిట్ అంతా ఎక్కడ చంద్రబాబు ఖాతాలోకి వెళ్లిపోతుందో అన్న భయం కూడా పవన్ కళ్యాణ్ లో కనబడుతుంది. 

స్మిత గతంలో కూడా అమరావతి రైతుల తరుఫున మాట్లాడింది. అమరావతి రైతుల ఆవేదనపై సింగర్ స్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గుండె బద్దలయ్యే వేదన ఇది. రైతులు ఇంతటి వేదన అనుభవిస్తుంటే ఏమీ పట్టనట్లు ఉండేవారిని చూస్తుంటే భాదగా ఉంది. అమరావతి రైతులారా మీకు నేనున్నా.. మీరు కోసం నేను ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా.. మీ బాధని పంచుకుంటున్నా. ఏదైనా సాధించడానికి మనందరం చేతులు కలుపుదాం'అని స్మిత ట్వీట్ చేసింది.