ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌ను సర్వనాశనం చేసిన ఈ బిల్లుపై మాట్లాడాల్సి రావడం ఎంతో బాధగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది నిద్రాహారాలు మాని రోడ్ల మీదకు వచ్చారని గుర్తుచేశారు.

అసెంబ్లీ బయట పదివేల మంది పోలీసులు ఉండటం చూస్తే.. మనం కాశ్మీర్‌లో ఉన్నామా లేక రామ జన్మభూమికి వెళ్తున్నామా అర్థం కాలేదని అనగాని చురకలంటించారు. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా అని సత్యప్రసాద్ ప్రశ్నించారు.

కనీసం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం అర్థం కాకుండా రాత్రికి రాత్రి బిల్లును రూపొందించారని అనగాని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆర్ధిక మంత్రి బుగ్గన గంటలపాటు తెలివిగా ప్రసంగించారని ఆయన దుయ్యబట్టారు.

Also Read:మూడు రాజధానుల బిల్లును సమర్ధిస్తున్నా: ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఐదున్నర కోట్ల తెలుగు ప్రజల భవిష్యత్ కోసం రైతులు 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చారని అనగాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి లాభం కోసం వైఎస్ జగన్ రాజధానిని అమరావతికి తీసుకెళ్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదని, కానీ ఆ ముసుగులో అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూడటానికి వ్యతిరేకమన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలకు కావాల్సిన అన్ని నిర్మాణాలు అమరావతిలో అందుబాటులో ఉన్నాయని కానీ కొంతమంది స్వార్థం కోసం రాజధానిని తరలించాలని చూడటం వెనుక కుట్ర ఉందని అనగాని విమర్శించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్న మాటలకు అమరావతిలో ఎన్నో గుండెలు ఆగిపోయాయని సత్యప్రసాద్ తెలిపారు. మహిళలను బూటు కాలితో తన్నడం విచారకరమని అనగాని అన్నారు. విశాఖను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా అభివృద్ధి చేయాలని సత్యప్రసాద్ సూచించారు.

Also Read:విజన్ 2020 అనే చంద్రబాబు పరిస్థితి ఇప్పుడేమైంది? కన్నబాబు సెటైర్లు

1995-2004 నుంచి చంద్రబాబు వేసిన ఆర్ధిక పునాదులను ఉపయోగించుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేసి చరిత్రలో నిలిచిపోయారని అనగాని గుర్తుచేశారు. అమరావతిని రాజధానిగా ఉంచుతామని చెప్పి వైసీపీ నేతలు ఎన్నికలకు వెళ్లారని.. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజధానిని తరలించడం దారుణమన్నారు. రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి నిర్ణయాన్ని తీసుకోవాలి కానీ రైతుల్ని బలి చేయొద్దని అనగాని తెలిపారు.