చంద్రబాబుపై దాడి  ఘటనపై టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 

విజయవాడ: అమరావతిలో పర్యటించే సమయంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుపై దాడికి పాల్పడిన ఘటనను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని టీడీపీ శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు చెప్పారు. 

Also read:మేం రెచ్చిపోతే తట్టుకోలేరు... జాగ్రత్తగా వుండండి: చంద్రబాబు హెచ్చరిక

అమరావతిలో చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకొన్న ఘటనలతో పాటు, మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా మాట్లాడిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసిన విషయమై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసినట్టుగా టీడీపీ నేతలు తెలిపారు.మంగళవారం నాడు టీడీపీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ దాడి ఘటన పై కేంద్రానికి పిర్యాదు చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేశారు. ఈ ఘటన పై పార్లమెంట్ లో లెవనెత్తుతామని చెప్పారు. జెడ్ ప్లస్ కేటగరీ భద్రత ఉన్న వ్యక్తిపై దాడి విషయంలో సరైన విచారణ చేయాలని టీడీపీ నేతలు కోరారు.

పోలీసు లాఠీ విషయంలో ఐజి వ్యాఖ్యలను మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు.పోలీసు లాఠీని ఎవరు విసిరారో తేలాల్సిన అవసరం ఉందన్నారు. ఈ లాఠీని ఎవరు విసిరారు, పోలీసుల నుండి వైసీపీ కార్యకర్తలు లాక్కొన్నారా, లేక పోలీసులే ఈ లాఠీలను ఇచ్చారా అనే కోణంలో కూడ విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తాము తీసుకెళ్లి బస్సుల అద్దాలను మేమే ఎలా ధ్వంసం చేసుకొంటామని ఆయన ప్రశ్నించారు. తాము తీసుకెళ్లిన బస్సులను సీజ్ చేసి, బస్సు డ్రైవర్లను అద్దాలు ముందే పగిలాయని చెప్పేలా ఒత్తిడి చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు చేశారు.

ఈ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే చాలా సీరియస్‌గా తీసుకొన్నారని ఆయన చెప్పారు. అమరావతి నిర్మాణాలు రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు చంద్రబాబునాయుడు పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.