ఎంఎల్ఏ అంటే అందరికీ  టెర్రర్

ఎంఎల్ఏ అంటే అందరికీ  టెర్రర్

పోలీసులనే ఆ ప్రజాప్రతినిధి హడలెత్తిస్తున్నారు. సదరు ప్రజా ప్రతినిధి నుండి ఫోన్ అంటేనే పోలీసు అధికారులు భయపడిపోతున్నారు. స్టేషన్లోనే ఉండి లేమని చెప్పిస్తున్నారు. ఆ విషయం ప్రజాప్రతినిధికి తెలిసిపోయింది.  దాంతో ఏ చిన్న అవసరమైన ఏకంగా పోలీసు స్టేషన్లకే వచ్చేస్తున్నారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక అధికారులకు టెన్సన్ తో చెమటలు పట్టేస్తున్నాయి.

ఇంతకీ ఆ ప్రజాప్రతినిధి ఎవరా అని ఆలోచిస్తున్నారా ? ఇంకెవరు అధికారపార్టీ నుండి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో గెలిచిన జెసి ప్రభాకర్ రెడ్డే. మొదటి నుండి జెసి సోదరులది విలక్షణమైన వ్యక్తిత్వమే. ఏ పార్టీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు వాళ్ళకి. తమ పనులు ఏ మేరకు అవుతున్నాయి, కాకపోతే ఎలా చేయించుకోవాలన్నదే వాళ్ళ లక్ష్యం. లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఏ స్ధాయికైనా పెరగ్గలరు, తగ్గ గలరు. కాంగ్రెస్ లో ఉన్నపుడు అదే పద్దతి.  ఇపుడు టిడిపిలో ఉన్నా అదే పద్దతి.

ఏ పార్టీలో ఉన్నా తమ వర్గానికి ఎటువంటి ముప్పు రాకుండా చూసుకోవటంలో మాత్రం వీరు గట్టోళ్ళే. అందుకే దశాబ్దాలైనా వీళ్ళ వర్గం ఏమాత్రం చెక్కుచెదరలేదు. జిల్లా, నియోజకవర్గ స్ధాయిలోని ఏ ప్రభుత్వ కార్యాలయమైనా వీళ్ళకు ఒకటే. ఏ అధికారినీ లెక్క చేయరు. పోలీసులనే కొట్టినంత పనిచేస్తున్న వీళ్ళకు మిగిలిన అధికారులు ఓ లెక్కా? మొన్నటికి మొన్న తాడిపత్రిలోని ఓ పోలీసు స్టేషన్లోకి దూరి ప్రభాకర్ రెడ్డి చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. ఎంఎల్ఏ దెబ్బకు పోలీసు అధికారులే హడలెత్తిపోయి అరెస్టు చేసిన వ్యక్తికి స్టేషన్ బెయిలిచ్చి అర్జంటుగా బయటకు పంపేసారంటేనే అర్ధమవుతోంది వీళ్ళ రేంజేమిటో.

నియోజకవర్గంలో పనిచేయాలంటేనే ప్రభుత్వ శాఖల్లోని అధికారులు భయపడిపోతున్నారు. ఎలాగైనా సరే, బదిలీ చేయించుకుని అక్కడి నుండి బయటపడేందుకే ప్రయత్నిస్తుంటారు. మున్సిపాలిటి, పోలీస్టేషన్, రెవిన్యూ కార్యాలయాలు, ఇరిగేషన్ కార్యాలయాలు ఇలా ఒకటేముంది? ఏ ప్రభుత్వ అధికారిలో చూసిన ఒకటే భయం.  వీళ్ళు ఎప్పుడొచ్చి తమ మీద పడతారో అంటూ ఆందోళన. అందుకే, అయినవాళ్ళకి వీళ్ళది హీరోయిజం, ప్రత్యర్ధులకు మాత్రం విలనిజం. కాబట్టే, వీళ్ళకి మద్దతుదారులెంతమంది ఉన్నారో శతృవులూ అంతేమంది ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళ భవిష్యత్తేంటో చూడాలి మరి.

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page