Asianet News TeluguAsianet News Telugu

దివాకర్ రెడ్డిని , సోదరిని చంపేందుకు ప్లాన్ .. టికెట్ కోసమే : జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి వ్యాఖ్యలు

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందేందుకు గాను జేసీ దివాకర్ రెడ్డిని, ఆయన సోదరిని ప్రభాకర్ రెడ్డి చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 

tadipatri mla kethireddy pedda reddy sensational comments on jc prabhakar reddy ksp
Author
First Published Aug 20, 2023, 4:07 PM IST

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ రెడ్డి తన కొడుకుని ఎమ్యెల్యేగా చేసేందుకు అన్న దివాకర్ రెడ్డిని చంపాలని అనుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెడ్‌పై వున్న ఆయన సోదరిని సైతం చంపాలనుకుంటున్నాడని మరో బాంబు పేల్చారు.

దివాకర్ రెడ్డిని చంపి సానుభూతిని పొందాలని చూస్తున్నాడని.. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఉనికి కోసం పాకులాడుతున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. దివాకర్ రెడ్డి ఇప్పటికే మతిస్థిమితం కోల్పోయారని.. త్వరలోనే ప్రభాకర్ రెడ్డికి కూడా ఆ జబ్బు వస్తుందన్నారు. హైస్కూల్ మైదానంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. దీనికి కాంపౌండ్ వాల్ కడితే తన ఆటలు సాగవని జేసీ భయపడుతున్నారని పెద్దారెద్ది ఆరోపించారు. 

అంతకుముందు కొద్దిరోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వంద కోట్ల రూపాయిలు మంజూరు చేస్తే తన పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మున్సిపాలిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దోచుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ALso Read : తాడిపత్రి బాగు కోసం వంద కోట్లు ఇవ్వండి.. వెంటనే రాజీనామా చేస్తా - జేసీ ప్రభాకర్ రెడ్డి

పోలీస్ స్టేషన్ నిర్మించాలని మున్సిపాలిటీ స్థలాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. అది సరైంది కాదని అన్నారు. ఆ స్థలంలో పోలీస్ స్టేషన్ కడితే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని చెప్పారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే.. జిల్లా ఎస్పీ అధికార పార్టీ ఆడించినట్టు ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. ఇలా మాట్లాడుతున్నందుకు తన మీద కక్ష పెట్టుకోకూడదని ఎస్పీని ఆయన కోరారు.

ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులకు మార్కెట్ లో షాప్ లు కేటాయించారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కౌన్సిలర్ రాబర్ట్ ను వైసీపీలో చేర్చుకున్నారని చెప్పారు. ఆయనకు మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని ఇచ్చారని, అందులో ఒక బిర్యానీ సెంటర్ ఏర్పాటు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని తెలిపారు.

ఇసుక తరలింపు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక తరలించకూడదని అని గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టు తీర్పులు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. అయినా కూడా ఇక్కడి నుంచి యథేచ్చగా తరలింపు జరుగుతోందని ఆరోపించారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదా అని ప్రశ్నించారు. తాడిపత్రి అంటే తన ఇళ్లు అని, దాని కోసం ప్రాణాలు అయినా ఇస్తానని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios