తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తాడిపత్రిలో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న ఘటనలపై కేతిరెడ్డి వివరణ ఇచ్చారు.

ఆయనతో పాటు అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్‌, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సీఎంను కలిసిన వారిలో వున్నారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో ఈ తరహా ఉద్రిక్త ఘటనలు జరిగేందుకు గల కారణాలను జగన్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

దీనిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి పూర్తి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాడిపత్రి వ్యవహారంపై సీఎం కొంత ఆగ్రహం వ్యక్తం చేశారని.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది.  

Also Read:తాడిపత్రి రగడ: జగన్ ‌నుంచి పిలుపు.. కేతిరెడ్డి వెనక్కి తగ్గుతారా..?

కొద్దిరోజుల కిందట తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లడం తీవ్ర ఉద్రిక్త‌తకు దారితీసిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో జేసీ అనుచరుడిగా వున్న కిరణ్‌ అనే వ్యక్తి తనను విమర్శిస్తున్నారని పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనే కిరణ్‌పై పెద్దారెడ్డి చేయి చేసుకున్నారు. దీంతో రగిలిపోయిన జేసీ వర్గీయులు ఎదురుదాడికి దిగారు. ఇదే సమయంలో ఇరు వర్గాలు రాళ్లదాడికి దిగడంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ఈ ఘర్షణలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలో 144 సెక్షన్ కూడా విధించారు. ఇక, అప్పటి నుంచి తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు.