Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రి రగడ: జగన్ ‌నుంచి పిలుపు.. కేతిరెడ్డి వెనక్కి తగ్గుతారా..?

తాడిపత్రిలో జేసీ బ్రదర్స్- కేతిరెడ్డి పెద్దారెడ్డి పోరు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. పార్టీకి చెడ్డ పేరు వస్తుండటంతో అలర్ట్ అయ్యారు

ap cm ys jagan calls mla pedda reddy over tadipatri incident ksp
Author
Tadipatri, First Published Jan 5, 2021, 3:20 PM IST

తాడిపత్రిలో జేసీ బ్రదర్స్- కేతిరెడ్డి పెద్దారెడ్డి పోరు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్.. పార్టీకి చెడ్డ పేరు వస్తుండటంతో అలర్ట్ అయ్యారు.

ఈ నేపథ్యంలో అసలు తాడిపత్రిలో ఏం జరుగుతోందంటూ పెద్దారెడ్డికి సీఎంవో నుంచి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారి ఒకరు.. పెద్దారెడ్డికి ఫోన్ చేసి ఇవాళ అమరావతికి రమ్మంటున్నారంటూ చెప్పారు.

దీంతో నియోజకవర్గంలో ఇవాళ పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్న కేతిరెడ్డి హుటాహుటిన కొంతమంది ప్రధాన అనుచరులతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. 

ఈ భేటీలో పెద్దారెడ్డి.. జగన్‌కు ఏం చెబుతారు..? వరుస ఘటనలపై జగన్ ఏమేం అడుగుతారో..? అనేదానిపై కేతిరెడ్డి అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ వర్గాలు ఓ కన్నేసి వుంచాయి.

Also Read:పోలీసులను దూషించారు:టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై కేసు

గత కొన్నిరోజులుగా ఎక్కడయినా వివాదాలు వస్తే చాలు జగన్ ఫోన్‌లో కాకుండా.. ఏకంగా తన కార్యాలయానికే పిలిపించి హెచ్చరించి పంపిస్తున్నారు. సోమవారం గుడివాడలో ‘పేకాట’ వ్యవహారంపై మంత్రి కొడాలి నాని.. సీఎం నివాసానికి వెళ్లి సంజాయిషీ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత నానిలో కాస్త దూకుడు తగ్గిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

కాగా తాడిపత్రిలో డిసెంబర్ 24 మొదలైన ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణానికి తాత్కాలికంగా విరామం పడింది. పోలీసుల తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం చేస్తున్నారంటూ జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్షకు దిగడం మొత్తం ఘటనను రాష్ట్ర స్థాయిలో రాజకీయాన్ని వేడెక్కించింది.

తాడిపత్రిలో ఏం జరుగుతుందోనంటూ పోలీసులు సైతం ఆందోళన చెందారు. అయితే ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయించుకున్న జేసీని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి వద్దనే నల్లదుస్తులు ధరించి దీక్ష చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios