అమరావతి: వైసీపీ తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ఓ పోలీసు అధికారిపై నోరు పారేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. పోలీసు అధికారిపై ఆమె తిట్ల దండకం అందుకున్నారు. సీఐని సంబోధిస్తూ ఏరా అని పిలిచినట్లు వార్తలు వచ్చాయి.

ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. హలో.. ఎప్పటి నుంచి చెప్తున్నా.. వాళ్లను పంపేయొచ్చుగా.. నీకేమైనా మెంటలా.. ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా, లేదా.. ఏం మాట్లాడుతున్నావ్. నేనంటే రెస్పెక్ట్ లేదా... అందరిని అయితే వదిలిపెడుతావ్.. నాన్సెన్స్.. నీపు పంపిస్తావా.. లేదా చెప్పు.. నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావ్. రెండు నిమిషాల్లో వెళ్లిపోతావ్.. ఎక్స్ ట్రాలు చేయొద్దు.. లేదంటే ఎస్పీకి, డీజీపికి చెబుతా అని సీఐపి నోటి దురుసు ప్రదర్శించినట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి.

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నందుకు ఓ సీఐని శ్రీదేవి అలా బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సిఐపై ఆగ్రహంతో ఊగిపోయారు. తాను చెప్పినట్లు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.