కుప్పం వైసీపీ నేత పార్థసారథి మృతిపై ఆయన తమ్ముడు కార్తీక్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనిమీద పూర్తిగా దర్యాప్తు చేయించాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
కుప్పం : కుప్పం వైసీపీ నేత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ పార్థసారథి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని... దీనిపై సిఐడి, సీబీఐ ద్వారా విచారణ జరపాలని అతని తమ్ముడు కార్తీక్ బుధవారం పలమనేరు డిఎస్పి గంగయ్యకు ఫిర్యాదు చేశారు. అందులోని కథనం మేరకు…‘పార్థసారథిని పథకం ప్రకారం మానసికంగా కుంగదీసి, కొట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ కేసును రైల్వే పోలీసుల నుంచి స్థానిక పోలీసులకు బదిలీ చేయాలి. మా సోదరుడు రైలుపట్టాలపై చనిపోయినట్లు సమాచారం అందిన వెంటనే.. సంఘటనా స్థలానికి వెళ్లే లోపు.. ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు. అదే రోజున మధ్యాహ్నం మృతదేహాన్ని అప్పగిస్తే ఇంటికి తీసుకొచ్చి మరుసటి రోజు దహనం చేశాం. మరణించిన రోజు రాత్రి మరణవాంగ్మూలం వీడియో బయటకు వచ్చింది.
ఇందులో ముగ్గురు తన చావుకు కారణం అంటూ చెప్పారు. దీంతో పాటు మరి కొందరు ఉన్నారు. ఇటీవల జరిగిన కుప్పం పురపాలక ఎన్నికలలో రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ తమ్ముడు అరుల్ కుమార్ ను 22వ సెగ్మెంట్లో నిలబెడితే గెలవలేకపోయారు. ఓటమికి మా అన్న పార్థసారథి ఇన్చార్జిగా ఉండి గెలిపించలేక పోయారని దూషణకు పాల్పడ్డారు. పార్థ సారథికి చెడ్డపేరు వచ్చేలా అక్రమ కేసులు పెట్టించి, మానసికంగా కృంగదీశారు. మరణానికి ముఖ్యకారకులు resco చైర్మన్ సెంథిల్ కుమార్, అతని తమ్ముడు అరుల్ కుమార్, కొంతమంది అనుచరుల పాత్ర ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. దీనిపై పూర్తి విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డి.ఎస్.పిని పలమనేరులో బంధువులతో పాటు కలిసి కలిసి కోరినట్లు కార్తీక్ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 4న వర్చువల్‌గా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజవర్గం కుప్పం అన్న విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తితో పాటు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ చెప్పారు.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోగా.. ఇప్పుడు ఆయనే అక్కడే రెవెన్యూ డివిజన్ కావాలని విజ్ఞప్తి చేసిన మేరకు, ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ కూడా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. పాలనా వికేంద్రీకరణే ప్రజలకు మేలు చేస్తుందని సీఎం జగన్ అన్నారు. గ్రామం నుంచి రాజధానుల వరకు ఇదే మా విధానమని చెప్పారు. గతంలో ఉన్న 13 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడామని తెలిపారు. 1970 మార్చిలో ప్రకాశం, 1979 జూన్‌లో విజయనగర జిల్లాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు.
