బెంగుళూరుకు చెందిన ఓ సంస్ధ ద్వారా భూమాకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అని చంద్రబాబు సర్వే చేయిస్తున్నారట. అంటే, భూమా భవిష్యత్తు సర్వే ఫలితాలపై ఆధారపడిందన్న మాట.

మంత్రి పదవులు ఇచ్చే ముందు సంబంధిత వ్యక్తులపై ఎవరైనా సర్వేలు చేయిస్తారా? ఇపుడు మంత్రివర్గంలో ఉన్నవారందరినీ సర్వేలు చేసిన తర్వాతనే తీసుకున్నారా? ఈ విధమైన చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇదంతా ఎందుకంటే, ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా ? అనే విషయంలో చంద్రబాబునాయుడు నియోజకవర్గంలో సర్వే జరిపిస్తున్నారట. విచిత్రంగా లేదు వినటానికి?

వైసీపీ తరపున నంద్యాల నియోజకవర్గంలో గెలిచి మంత్రి పదవి హామీతో టిడిపిలోకి ఫిరాయించారు భూమా దాదాపు ఏడాదిక్రితం. అయితే, అప్పటి నుండి మంత్రిపదవి అందని ద్రాక్షపండులాగే తయారైంది. ఇంతలో భూమాకు మంత్రి పదవి ఇవ్వకూడదంటూ టిడిపి నేతలు పలువురు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే, టిడిపిలోకి చేరినప్పటి నుండి నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో భూమా ఆగడాలు మితిమీరిపోయాయి. అదే విషయాన్ని అక్కడి నేతలు చంద్రబాబుకు ఎంత చెప్పుకున్నా ఉపయోగం కనబడలేదు. దాంతో భూమా వర్గాలు, వ్యతిరేక వర్గాలు గొడవలుపడుతూ రోడ్డెకెక్కాయి.

తాజాగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై పార్టీలో ప్రచారం మొదలైంది. దాంతో భూమాలో మంత్రిపదవిపై ఆశలు పెరుగుతున్నాయి. ఇంతలో సర్వే విషయం వెలుగులోకి వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఓ సంస్ధ ద్వారా భూమాకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అని చంద్రబాబు సర్వే చేయిస్తున్నారట. అంటే, భూమా భవిష్యత్తు సర్వే ఫలితాలపై ఆధారపడిందన్న మాట. ఓ వేళ సర్వేలో వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు ఏమి చేస్తారు? అనుకూలంగా వస్తే ప్రత్యర్ధులు ఏమి చేస్తారు అన్నది సర్వత్రా ఆశక్తిగా మారింది. పనిలో పనిగా మంత్రులపైన, ఆశావహులపైన కూడా ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబు సర్వే చేయించేస్తే పోలా?