చంద్రబాబుకు ఎనిమిదో స్ధానమా? అసలు సర్వే ఫలితాలు నమ్మదగ్గట్లున్నాయా? రోజుకు 18 గంటలు పనిచేస్తున్న సిఎంకు ఎనిమిదో స్ధానమా
ఉత్తమ ముఖ్యమంత్రలలో చంద్రబాబునాయడుకు ఎనిమిదో స్ధానమా? అసలు సర్వే ఫలితం నమ్మేలాగుందా? మరి సర్వేనే నిజమైతే ఏపి జనాలు చంద్రబాబు ప్రభుత్వంపై 98 శాతం సంతృప్తి వ్యక్తం చేసిన సంగతి ఏమైంది? ప్రభుత్వం జరిపించిన అనేక సర్వేల్లో రాష్ట్రంలోని అత్యధిక శాతం మంది ప్రజలు చంద్రబాబు పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అనుకుంటుంటే తాజాగా అదేదో సంస్ధ విడుదల చేసిన ర్యాంకింగ్ ల్లో చంద్రన్నకు ఎనిమిదో స్ధానం దక్కటం కూసింత బాధాకరం, అనుమానాస్పదమే.
అసలు విడిపి అసోసియేట్స్ ఏ పద్దతుల్లో సర్వే చేసిందో ప్రజలకు అర్ధం కావటం లేదు. చంద్రబాబుకు సంబంధించిన విషయాల్లో కూడా సదరు సంస్ధ మొత్తం తెలంగాణాలోనే సర్వే చేయలేదు కదా అని ఏపిలోని టిడిపి నేతలు, ప్రజలు అనుమానిస్తున్నారు. లేకపోతే, చంద్రబాబుకు ఏమిటి ఎనిమిదో స్ధానం రావటం ఏమిటి? పోయిన సారి ఐదో స్ధానంలో నిలిచిన చంద్రబాబు ఈ సారి మొదటి స్ధానంలో నిలుస్తారని అందరూ అనుకుంటుంటే ఏకంగా మూడు స్ధానాలు వెన్నక్కు పడిపోవటంలో ఏదో మర్మముంది.
గడచిన రెండు సంవత్సరాలుగా చంద్రబాబు, టిడిపి జరిపించిన ప్రతీ సర్వేలోనూ చంద్రబాబుకే అగ్ర తాంబూలం. అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే లేకుండా చేయాలని అహర్నిసలూ ఆలోచిస్తున్న చంద్రబాబుకు, టిడిపి జనాలకు తాజా సర్వే ఏమాత్రం మింగుడు పడటం లేదు. గతంలో ఎన్నికలప్పుడు తప్ప రాజకీయాలు మాట్లాడని చంద్రన్న గడచిన రెండేళ్ళుగా పూర్తిగా రాజకీయంపైనే దృష్టి పెట్టీ మరీ ప్రధాన ప్రతిపక్షాన్ని చీల్చి చెండాతున్న విషయం సర్వే చేసిన జనాలకు కనబడలేదా?
మొత్తం దేశమంతా, ఆమాటకు వస్తే యావత్ ప్రపంచమే ఏపిలో చంద్రన్న పాలనకు ఫిదా అయిపోతుంటే సర్వే చేసిన సంస్దకు మాత్రం చంద్రబాబు పాలనా దక్షత కనబడలేదా? ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు సాధించినన్ని అద్భుతాలు మరే ముఖ్యమంత్రీ సాధించలేదని ఓవైపు తెలుగు మీడియా కోడై కోస్తుంటే కనీసం అది కూడా సర్వే జనాలకు వినబడలేదా?
ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే హుద్ హుద్ పైన విజయం సాధించారా? ఆ తర్వాత వచ్చిన తుఫానుపై పై చేయి సాధించారా? మొన్నటి మొన్న కరువును తరిమేసారా? వర్షాలు రాకుంటే రైన్ గన్స్ అనే వినూత్నమైన ప్రక్రియతో ప్రపంచంలోనే మొదటిసారి లక్షలాది ఎకరాలకు నీరందించారా? అదే విధంగా దోమలపై విజయం సాధించి, పేదరికంపై గెలుపుకు కృషి చేస్తున్నారా? ఏం ఇవేవీ సర్వే సంస్ధకు కనబడలేదా? ఇవేవీ ఉత్తమ సిఎంగా నెంబర్1 నిలిచేందుకు పనికిరావా?
ఇక రాజధాని నిర్మాణాన్ని తలకెత్తుకున్నారా? ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చు లేకుండానే వేలాది ఎకరాలను సమీకరించిన విషయంలో చంద్రన్న పాలనాధక్షతను ఎవరైనా కాదనగలరా? పట్టిసీమను రికార్దు సమయంలో పూర్తి చేయటం, పోలవరాన్ని ఉరుకెలిత్తిస్తుండటం లాంటివి సర్వే సంస్ధలకు కనబడలేదేమో. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేందుకు చంద్రన్న నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సులు, పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు తిరగటం, ప్రపంచ దేశాలను అమరావతికి పిలిపించటం లాంటివి కూడా సర్వే సంస్ధకు కనబడలేదేమో.
అంతెందుకు, చంద్రన్న పాలనపై ప్రజా సంతృప్తి విషయంలో ఏ మీడియానడిగినా ఠక్కున సమాధానం వస్తుంది కదా. ఇన్ని విజయాలు సాధించిన, సాధిస్తున్న చంద్రబాబుకు ఎనిమిదో స్ధానం కట్టబెట్టటం, అదీ దీపావళికి సరిగ్గా ముందు రోజు ఫలితాలను విడుదల చేయటంలో ఎవరిదైనా కుట్ర ఉందా అని కూడా తమ్ముళ్ళు అనుమానిస్తున్నట్లు సమాచారం.
కాకపోతే సంభరాలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు లేండి. అసలు ఇటువంటి సర్వేలను జరిపించ కూడదని, ఒకవేళ జరిపించినా విడుదల చేయకూడదని పనిలో పనిగా కోర్టుకెళ్లి స్టే తెస్తే ఎలాగుంటుందని తమ్ముళ్ళు ఆలోచిస్తే అది వాళ్ళ తప్పు కాదు. ఎనీ డౌట్?
