స్కిల్ డెవలప్ మెంట్ కేసులోబాబు పిటిషన్ : సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం నాడు తీర్పును వెల్లడించనుంది.ఈ తీర్పు విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలు సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు.
2023 సెప్టెంబర్ 9వ తేదీన నారా చంద్రబాబునాయుడిని స్కిల్ కేసులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2023 సెప్టెంబర్ 22న ఈ పిటిషన్ ను కొట్టివేసింది.
also read:ఆంధ్రప్రదేశ్‌పై ఫోకస్: కాంగ్రెస్ టార్గెట్ అదే, రంగంలోకి షర్మిల?
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో చంద్రబాబునాయుడు సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడు తరపున సిద్దార్ధ్ లూథ్రా, హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు 17 ఏ సెక్షన్ వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తోసిపుచ్చారు.
also read:తప్పులకు సహకరించిన అధికారులను జైలుకు పంపుతాం: చంద్రబాబు వార్నింగ్
17 ఏ సెక్షన్ కు చంద్రబాబుకు వర్తిస్తుందని చంద్రబాబు లాయర్లు, వర్తించదని ఏపీ సీఐడీ లాయర్లు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ మేరకు రాత పూర్వకంగా కోర్టుకు తమ వాదనలను సమర్పించారు. 2023 అక్టోబర్ 17న ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి కూడ 17 ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ ఈ వాదనలను తోసిపుచ్చారు.
also read:భారత్‌లో ఏటా రూ. 70 లక్షల సంపాదన: ఏడు వృత్తులు ఇవే.
ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుకు కూడ 17 ఏ సెక్షన్ తో లింకు ఉన్నందున స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి తీర్పు వెల్లడించిన తర్వాత ఈ కేసును విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పును వెల్లడించనుంది.