ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు: చంద్రబాబు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
న్యూఢిల్లీ:ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని, రిమాండ్ ను రద్దు చేయాలని చంద్రబాబు ఏపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 22న కొట్టివేసింది. దీంతో ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా,అభిషేక్ సింఘ్విలు వాదనలు వినిపించారు. ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఒక్కసారి ప్రత్యక్షంగా హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదనలు విన్పించారు. మిగిలిన అన్ని విచారణల సమయంలో హరీష్ సాల్వే వర్చువల్ గా తన వాదనలను విన్పించారు.
also read:17 ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫారసులకే వర్తిస్తుంది: సుప్రీంలో రోహత్గీ
ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణను నిర్వహించింది. తొలుత ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించారు. రోహత్గీ వాదనలు ముగించిన తర్వాత చంద్రబాబు తరపున వర్చువల్ గా హరీష్ సాల్వే వాదించారు. వాదనలు ముగించే సమయంలో రాతపూర్వకంగా కూడ అవసరమైతే తన వాదనలను విన్పించనున్నట్టుగా సాల్వే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేసిన వెంటనే ఏపీ సర్కార్ కూడ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తమ వాదనలు కూడ వినాలని సుప్రీంను జగన్ సర్కార్ కోరింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు ప్రస్తుతం జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.