న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను పునర్నియామకంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేసింది.
ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. 

also read:సుప్రీంలో జగన్‌కు షాక్: హైకోర్టు తీర్పుపై 'స్టే'కి నిరాకరణ

ఇదే అంశంపై ఇప్పటికే విచారణ జరిపి నోటీసులు ఇచ్చినట్టుగా ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.ఈ మేరకు కొత్తగా దాఖలైన పిటిషన్లను గత పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ పిటిషన్ పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ఉంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.  హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు నిరాకరించింది. రాజ్యాంగ పదవులతో ఆటలాడుకోవద్దని ఆదేశించింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ ఏడాది మే 29వ తేదీన ఏపీఎస్ఈసీగా కనగరాజ్ నియామకానికి సంబంధించి జారీచేసిన జీవోలతో పాటు పంచాయితీ రాజ్ చట్టాన్ని మారుస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను కూడ ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.