నకిలీ డీడీల కుంభకోణంలో టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

న్యూఢిల్లీ: నకిలీ డీడీల కుంభకోణంలో టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

హైద్రాబాద్ సనత్ నగర్ లోని పంజాబ్ నేషన్ బ్యాంకు డీడీలను తస్కరించి రూ.8.29 కోట్లను కందికుంట వెంకట ప్రసాద్ కాజేశారనే కేసులో సీబీఐ కోర్టు ఆయనకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 13 లక్షల జరిమానాను విధించింది. ఇదే తరహలో ఎస్బీఐ హుస్సేనీఆలం బ్రాంచీలో కూడ నకిలీ డీడీలకు సంబంధించి రూ. 3.20 కోట్లు మోసగించారనే కేసులో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ కందికుంట వెంకటప్రసాద్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఉన్న సమయంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెంకటప్రసాద్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఈ విషయమై కదిరికి చెందిన అబుబాకర్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్ పై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో ఈ నెల 27వ తేదీన విచారణ జరిగింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కింది కోర్టులో శిక్ష పడిన వ్యక్తి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లిన సమయంలో ఆ కేసు విచారణలో ఉండగానే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరికల్లా ఈ కేసును తేల్చేయాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. 

ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ఎలాంటి ఎన్నికల్లో కూడ కందికుంట వెంకటప్రసాద్ పోటీ చేయరని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు.