నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థతోపాటు ఆ సంస్థ అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా, కేసులో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు, మాజీ ఐపీఎస్‌ అధికారి కృష్ణంరాజుకు కూడా నోటీసులు జారీ చేసింది.అత్యున్నత న్యాయస్థానం. 

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థపై ఆరోపణలకు సంబంధించి ట్రయల్‌ కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు గతంలో కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఈ పెతితిఒన్ ని కొట్టేయడంతో.... హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. 

ఈ అప్పీలు పిటిషన్ పై నిన్న సోమవారం నాడు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌‌ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ లో ఆర్బీఐ ని ప్రతివాదిగా చేర్చాలని ఉండవల్లి కోరిన నేపథ్యంలో.... సుప్రీమ్ కోర్టు అందుకు అంగీకరించింది. 

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అప్పీలు చేయ నందున తాను ఎస్సెల్పీ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలన్న ఉండవల్లి అభ్యర్ధనకు ధర్మాసనం అనుమతించింది. అలాగే, ఎస్సెల్పీలోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసింది.

తమపై ఉన్న క్రిమినల్‌ కంప్లయింట్‌ ను కొట్టివేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒకరోజు ముందు కొట్టివేసిందని ఉండవల్లి తరుఫు వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.సత్యనారాయణ ప్రసాద్, అల్లంకి రమేష్‌ లు న్యాయస్థానానికి వివరించారు.

రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)ను హైకోర్టు సరిగ్గా అన్వయించలేదని వారు కోర్టుకు విన్నవించారు. అంతేకాకుండా....  హిందూ అవిభక్త కుటుంబం (హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ) పరిధిలోకి వచ్చే సంస్థలకు డిపాజిట్లు సేకరించే అధికారం లేదని వారు సుప్రీంకోర్టుకు తెలిపారు.