సారాంశం

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరించాల్సి వున్నందున ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 

అమరావతి : పైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం డిసెంబర్ 12 కు వాయిదా వేసింది. 

ఈ ఫైబర్ కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలు స్కిల్ డెవలప్ మెంట్ లో క్వాష్ పిటిషన్ తీర్పు గుర్తించి ప్రస్తావించారు. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రాస్తున్నామని... అప్పటివరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలను బట్టి డిసెంబర్ 12వ తేదీలోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. 

ఇదిలావుంటే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సన్నిహితుల ఆస్తుల జప్తుకు సిఐడి సిద్దమయ్యింది. ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ అనుమతి లభించగా ఏసిబి కోర్టు అనుమతికోసం సిఐడి ప్రయత్నిస్తోంది. మొత్తం ఏడుగురు నిందితులకు చెందిన ఆస్తులను  జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసిబి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సాగుతోంది. 

Read More  Nara Bhuvaneswari : నా ప్రార్థనను దేవుడు విన్నాడు..: తిరుమల వెంకన్న సన్నిధిలో భువనేశ్వరి భావోద్వేగం

ఈ ఫైబర్ కేసులో ఏ1 గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్,  ఏ 11 గా టెరా సాఫ్ట్ వేర్ లిమిటెడ్ సంస్థ  డైరెక్టర్ తుమ్మల గోపిచంద్ లు కుట్రకు పాల్పడ్డారని  సీఐడీ ఆరోపించింది.తుమ్మల గోపిచంద్ , ఆయన భార్య  పావని పేర్లపై హైద్రాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్న మంగళారంలో ఇల్లు, వ్యవసాయక్షేత్రాలు అటాచ్ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.