న్యూఢిల్లీ: ఓ కేసులో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. ఓ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించిన సుదీర్ఘ కాలం తర్వాత అపీల్ చేసినందుకు ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

మత్స్యశాఖ అధికారి లంచం అడిగారంటూ 1999లో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఎం. శ్రీనివాస రావు తప్పుడు ఫిర్యాదు చేశారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయనపై ఐపిఎస్ 211వ సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలని ఎసీబి ప్రత్యేక కోర్టు ఆదేశించింది. దాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస రావు ఉమ్మడి హైకోర్టు తలుపు తట్టారు. 

విచారణ తర్వాత 201ఆగస్టు 28వ తేదీన ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. దాన్ని సుదీర్ఘ కాలం తర్వాత సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ శుక్రవారంనాడు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్ లతో కూడిన త్రిసభ్య బెంచ్ ముందు విచారణకు వచ్చింది.

ఆలస్యంగా దాన్ని సవాల్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన 455 రోజుల తర్వాత ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేసి సరిదిద్దలేని అసమర్థతను ప్రభుత్వం ప్రదర్శించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ వైఖరిని తాము తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు తెలిపింది.