స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు కేటాయించిన నిధులను దారి మళ్లించడం కుదరదని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.  

అసలే పీకల్లోతు అప్పులలో కూరుకుపోయి.. దినదిన గండంగా బండిని నడుపుతోన్న ఏపీలోని వైఎస్ జగన్ (Ys jagan) ప్రభుత్వానికి సుప్రీంకోర్టు (supreme court) షాకిచ్చింది. ఓ ప‌నికి నిర్దేశించిన నిధుల‌ను ఇత‌ర‌త్రా ప‌నుల‌కు మ‌ళ్లిస్తూ ఏపీ ప్రభుత్వం (ap govt) నిర్ణ‌యం తీసుకోగా.. ఆ నిధుల మ‌ళ్లింపును నిలుపుద‌ల చేస్తూ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలో స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్‌) (state disaster response force) కింద కేటాయించిన నిధుల‌ను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తూ పీడీ ఖాతాలకు మ‌ళ్లించింది. ఈ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన సుప్రీంకోర్టు దానిపై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టింది. ఈ సంద‌ర్భంగా ఏపీ స‌ర్కారు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌ది కాదంటూ కోర్టుకు తెలిపింది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పంద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఏపీ స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేకాకుండా ఎస్టీఆర్ఎప్ నిధుల‌ను దారి మళ్లించ‌డం కుద‌ర‌ద‌ని స్పష్టం చేసింది. ఈ మేరకు నిధులు మ‌ళ్లిస్తూ ఏపీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని నిలుపుద‌ల చేసింది. అనంతరం త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 28కి వాయిదా వేసింది.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసందే. రాష్ట్ర ప్రభుత్వం భారీగా బడ్జెట్‌యేతర అప్పులు చేసినట్లు కేంద్రమే ధృవీకరించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి కార్పొరేషన్‌లు, కంపెనీల పేరుతో రూ. 56,076 కోట్లు అప్పుగా తీసుకుందని కేంద్రం తెలిపింది. గతేడాది రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 

వివిధ బ్యాంకుల నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో ఎక్కువగా ఎస్‌బీఐ నుంచి అత్యధికంగా రూ.15,000 కోట్లకుపైగా తీసుకుంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 9వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 7వేల కోట్లు, యూబీఐ నుంచి రూ. 6,800 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ. 5,700 కోట్లు, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ. 4వేల కోట్లకుపైగా ఏపీ అప్పు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతమైన అప్పులు చేస్తోందని, ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని విపక్షాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. చివరికి ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.