అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తాము దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగకుండా చూడాలనే పట్టుదలతో ఉన్న వైఎస్ జగన్ అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో, అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

Also Read: ఏపీ సిబ్బంది సహాయ నిరాకరణ: కేంద్ర హోం కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ

జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరాం హాజరయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాము ఎన్నికల నిర్వహణ విధులకు హాజరవుతామని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పడం లేదు. 

ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. వైఎస్ జగన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సాయంత్రం అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. జగన్ సమీక్షా సమావేశం నిర్ణయం ప్రకారం అధికారులు వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Also Read: బలవంతంగా ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దు: ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి

గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. సోమవారం జరగాల్సిన నామినేషన్ల పర్వం ఆగిపోయింది. దాంతో ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ రీషెడ్యూల్ చేశారు.