Asianet News TeluguAsianet News Telugu

వెెంకయ్య శిష్యరికంలో సుజనా

‘అసలు ప్యాకేజికి ఇంకా ఓ రూపమే రాలేద’ని స్పష్టంగా కేంద్రం చెప్పింది. ఎందుకంటే, క్యాబినెట్ సమావేశంలో పెట్టటానికి ఇంకా నోట్ కూడా తయారుకాలేదట.

sujana chowdary stepping in to Venkaiah shoes

కేంద్ర సహాయమంత్రి సుజనా చౌదరి క్యాబినెట్  మంత్రి వెంకయ్యనాయుడు వద్ద బాగానే శిష్యరికం చేస్తున్నారు. సరిగ్గా వెంకయ్య అడుగుజాడల్లోనే సుజనా  నడుస్తున్నారు. ఎలాగంటారా? మాటలు చెప్పటంలో, ప్రతిపక్షాలను వెటకారం చేయటంలో. అవును కేవలం మాటలు చెప్పటంలో మాత్రమే. గిట్టని వాళ్ళు వాటిని అబద్దాలని కూడా అంటారు లేండి. ప్రత్యేకప్యాకేజికి కేంద్రప్రభుత్వం 15 రోజుల్లో చట్టబద్దత కల్పిస్తున్నట్లు వారం రోజుల క్రితం సుజనా చెప్పిన సంగతి అందరూ వినేవుంటారు. పైగా రాసుకోండి నేను చెబుతున్నానని మరీ ఘట్టీగా కూడా చెప్పారు.

 

ఇపుడదే విషయం చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్యాకేజి విషయమై ఓ ప్రశ్న వేసారు. దానికి లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ‘అసలు ప్యాకేజికి ఇంకా ఓ రూపమే రాలేద’ని స్పష్టంగా కేంద్రం చెప్పింది. ఎందుకంటే, క్యాబినెట్ సమావేశంలో పెట్టటానికి ఇంకా నోట్ కూడా తయారుకాలేదట. నోట్ తయారైన తర్వాత క్యాబినెట్ సమావేశంలో చర్చకు వస్తుంది. క్యాబినెట్ ఆమోదం పొందితే సదరు అంశం పార్లమెంట్ కు వెళుతుంది.

 

అక్కడ చర్చ జరగాలి, అవసరమైతే ఓటింగ్ జరగాలి. ఇలా చాలా పెద్ద తతంగమే ఉంది. తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళుతుంది. ఇవన్నీ అయ్యేటప్పటికి ఎంతలేదన్నా మాసాలు పడుతుంది. మరి ఈ విషయాలేవీ తెలీకుండానే సుజనా 15 రోజుల్లో ప్రత్యేకప్యాకేజిపై చట్టబద్దత వచ్చేస్తుందని చెప్పారా? 15 రోజుల్లో చట్టబద్దత రాదని సుజనాకు బాగా తెలుసు. అయినా సుజనా వ్యవహారం గురించి కొత్తగా చెప్పేదేముంది? మొదటి నుండీ అంతే. వారం రోజుల్లో కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చేస్తోందని ఎన్నిసార్లు చెప్పలేదు ఏడాది క్రితం? విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వే జోన్ అంశం కూడా కేంద్రం సీరియస్ గా యోచిస్తోందని ఎన్నోమార్లు చెప్పారు. సుజనా మాట అంటేనే నీటి మీద మాట లాగ తయారైంది.

 

 

చెప్పిన మాట చెప్పకుండా, ఇన్నిసార్లు మాటలు మారుస్తుంటే జనాలు ఏమనుకుంటారన్న వెరుపు కూడా లేకుండానే సుజనా రోజులు నెట్టుకొస్తున్నారు. అందుకనే సుజనాను జూనియర్ వెంకయ్య అని అంటున్నారు. ఎందుకంటే, వెంకయ్యనాయడు కూడా మాటలు మార్చటంలో దిట్ట. అబద్దాన్ని చెబుతూ కూడా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అదే బాటలో ఇపుడు సుజనా కూడా నడుస్తున్నారు. మొత్తానికి సుజనాను వెంకయ్య వద్ద  చంద్రబాబు భలేగా శిష్యరికం చేయిస్తున్నారు.