Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆత్మహత్య: ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివీ...

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 1 నిందుతుడు సూసైడ్ చేసుకోవడం, అందుకు ఒక పోలీస్ అధికారి వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో తీవ్ర వివాదాస్పద అంశంగా ఇది మారింది.

suicide of accused in YS Viveka murder case poses questions
Author
Kadapa, First Published Sep 3, 2019, 2:22 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఎన్నికల ముందు సంచలనం సృష్టించిన వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తారు అని అంతా భావించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా కూడా ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 

ఇంతలోనే నిన్న సోమవారం రాత్రి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస  రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణానికి ముందు సూసైడ్ నోట్ కూడా వదిలి వెళ్ళాడు. ఇన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు మరోసారి యావత్తు మీడియా దృష్టిని ఆకర్షించింది. 

ఇలా ఏ 1 నిందుతుడు సూసైడ్ చేసుకోవడం, అందుకు ఒక పోలీస్ అధికారి వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో తీవ్ర వివాదాస్పద అంశంగా ఇది మారింది. సాధారణంగానే వ్యక్తి మరణ వాంగ్మూలానికి గానీ, సూసైడ్ నోట్లకు గాని అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కారణమేంటంటే, వారు మరణించే ముందు ఎవరి పేరైనా చెప్పారంటే, ఎంతో మానసిక క్షోభను అనుభవించిన తరువాత ఇక బ్రతుకు మీద ఆశ చచ్చి మాత్రమే బలవన్మరణానికి పాల్పడుతారు. 

ఈ కేసు విషయానికి వస్తే, ఆది నుంచి కూడా వివాదాలు ఈ కేసు చుట్టూరా తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలా ప్రధాన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడడంతో మరో కొత్త వివాదం మొదలైంది. 

వివేకానంద రెడ్డి హత్య ఒక సాదాసీదా మర్డరే అయితే, ఈ కేసులో  సాక్ష్యాధారాలను తారుమారు చేయాలనే ఉద్దేశ్యమే లేకపోతే, ఇలా నిందుతుడిని ఎందుకు బెదిరించవలిసి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 

ఇలా బెదిరింపులకు దిగుతున్నారన్నా, ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నా, బలమైన శక్తులు ఏవో వీరి వెనుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవడం సహజం. చట్ట పరిధికి లోబడి పనిచేసే పోలీస్ అధికారులు ఇలా బెదిరిస్తున్నారనే విషయం స్వయంగా సూసైడ్ నోటులోనే పేర్కొనడంతో, ఏవో బయట శక్తులు వారితో ఈ పనులు చూపిస్తున్నాయనే విషయం సుస్పష్టం. 

ప్రధాన నిందితుడి ఆత్మహత్యను గనుక పరిశీలిస్తే, ఏవో బయటి శక్తులు ఈ కేసును వక్రీకరించడానికి, సాక్ష్యాలను తారుమారు చేయడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడం కోసం ఇలా సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి పోలీస్ వ్యవస్థను సైతం ఉపయోగించుకుంటున్నారనేది  ఒక వాస్తవం. ఇలా ఈ కేసులో ఇటువంటి బలమైన శక్తులు ఎవరు? ఎందుకు ఇలాంటి ప్రయత్నాలను చేస్తున్నారో కోర్టు సాధ్యమైనంత త్వరగా తేల్చాలి. 

ఈ కేసు పైన మొదటినుండి కూడా రకరకాల వివాదాలు, కాంట్రవర్సీలు తలెత్తుతూనే ఉన్నాయి. వివేకానందరెడ్డి మరణ వార్త మనందరికీ తెలిసినప్పటినుండి పోస్టుమార్టానికి శవాన్ని తరలించేవరకుకూడా టీవీల్లో వివేకా గుండెపోటుతో మరణించారని వార్తనే మనం చూసాము.

 అక్కడి దృశ్యాలను టీవీల్లో చూసిన సాధారణ ప్రజలకే ఇది సహజ మరణం కాదు అనే విషయం అర్థమవుతుంది. ఇలా తల మీద గాయంతో రక్తపు మడుగులో పడి  ఉన్న వ్యక్తి శవాన్ని చూసి గుండెపోటుతో మరణించారు అనే కంక్లూషన్ కు ఎలా వచ్చారు? 

అప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా అక్కడకు వచ్చారు. కనీసం అనుమానాస్పద మృతిగా కూడా పేర్కొనకుండా ఇలా గుండెపోటు అనే నిర్ణయానికి ఎలా వచ్చారు? ఎవరి ప్రొద్బలంతోనన్నా ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేశారా . 

ఇది హత్య అని నిర్ధారితమైన తరువాత ప్రెస్ మీట్ పెట్టి జగన్ ఇది చంద్రబాబు లోకేశ్ లు ఆది నారాయణ రెడ్డి ద్వారా ఈ హత్య చేపించారు అని ఆరోపించారు. హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నదీ టీడీపీ ప్రభుత్వం గనుక నిజానిజాలను అప్పటికప్పుడు తేల్చడం అంత తేలికైన పనికాదు. 

ఎన్నికల సమయం కూడా అవడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు కూడా. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నుంచి మొదలుకొని ఎన్నికల నిర్వహణ వరకు ఇన్ని పనుల్లో నిమగ్నమయి ఉండే పోలీసులు ఇలాంటి హై ప్రొఫైల్ మర్డర్ విషయంలో ఏదో ఆషామాషీ విచారణ జరిపి ఒక కొలిక్కి రాలేరు. మనం ఆ సమయంలో వారిని తప్పుబట్టలేము కూడా. 

ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. అప్పుడు టీడీపీ నేతలపైన ఆరోపణలు చేసిన జగన్ అధికారంలోకి వచ్చి కూడా 100 రోజులు దాదాపుగా పూర్తయింది. ఇన్ని రోజుల తరువాత కూడా నిజంగా టీడీపీ నేతల హస్తం ఉండి  ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు? 

 అన్ని విషయాల్లోనూ టీడీపీని ఎండగట్టే ప్రయత్నాన్ని నెత్తికెత్తుకున్న వైసీపీ ఈ విషయంలో ఎందుకు దూకుడు ప్రదర్శించడం లేదు. వారికి ఇది పొలిటికల్ మైలేజీని ఇస్తుంది కూడా. ఈ కేసు ఒక్కటే కాదు. జగన్ పై హత్యాయత్నం కేసు విషయంలో కూడా పురోగతి ఎక్కడిదాకా వచ్చిందో మనందరికీ తెలుసు.  

ఇలా ఈ హత్యపైన  అభియోగం మోపిన వారే కేసు విచారణను యుద్ధ ప్రాతిపదికన ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు అనేది మరో  వివాదం.

జగన్ టీడీపీ నేతలపై అభియోగం మోపగానే వారు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తూ చెప్పిందేంటంటే, వారికి కుటుంబ తగాదాలున్నాయి. వారే ఈ పనికి ఒడిగట్టారు అని. ఎన్నికల సమయం కాబట్టి ఎవరూ వీటిని అంతలా పట్టించుకోలేదు మరీ ముఖ్యంగా వివేకా కూతురు మీడియా ముందుకు వచ్చి ఏ కుటుంబంలో ఇలాంటి గొడవల్లేవు? ఉన్నంత మాత్రాన మనుషులను చంపుకుంటామా చెప్పండి అనడంతో అందరూ కూడా ఈ విషయం పై ఏకీభవించారు కూడా. 

జగన్ పార్టీ పెట్టగానే వివేకా వైసీపీ లో  చేరలేదు. ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసారు కూడా. అదంతా గతం. అటు తరువాత వివేకా వైసీపీలో చేరారు. దెగ్గరుండీ పార్టీ కార్యకలాపాలను నిర్వహించారు కూడా. 

ఇప్పుడు ఇలా ప్రధాన నిందితుడు సూసైడ్ చేసుకోవడంతో టీడీపీ నేతలు మరోమారు ఈ విషయంపైన అనుమానాలు లేవనెత్తుతున్నారు. అసలు నిజాలను కోర్టు నిగ్గు తేల్చే వరకు ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపరణాలే తప్ప వాస్తవాలు కావు. 

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిపైన మాత్రం ఒక బృహత్తర బాధ్యత ఉంది. హత్యగావింపబడ్డ వ్యక్తి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నాన. ఇటువంటి కేసు తప్పుదోవ పట్టకుండా తగు చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ప్రభుత్వంపైన నమ్మకం పెరుగుతుంది. ఈ దిశగా జగన్ కృషి చేసి రాష్ట్ర ప్రజల తనపైన పెట్టుకున్న విశ్వాసాన్ని నిలుపుకోవాలి.  

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్, పోలీసుల అనుమానాలివి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్

Follow Us:
Download App:
  • android
  • ios